🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 16 April 2026, 12:22 am Posted by : DAINAMIC NEWS

బోరు పైపు లైన్ లీక్… నీళ్లు వృథా – అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం– మూడు నెలలుగా సమస్య కొనసాగినా చర్యలు శూన్యం– ఎండాకాలంలో నీటి వృథాపై ప్రజల ఆగ్రహం– ఫిర్యాదులు చేసినా స్పందించని పాలకవర్గం

News Image

శుభోదయ డైనమిక్ న్యూస్, హుజూర్ నగర్: ఏప్రిల్ 16





హుజూర్నగర్ మండలం లింగగిరి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. గ్రామంలోని నాలుగో వార్డ్ మెయిన్ బజార్లో బోరు పైపు లైన్ లీక్ అయి దాదాపు మూడు నెలలుగా నీరు వృథాగా పారిపోతున్నా, గ్రామపంచాయతీ సిబ్బంది గానీ, పాలకవర్గం గానీ పట్టించుకోకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.




ఫిర్యాదులు విన్నా విననట్టే వ్యవహారం





ఈ సమస్యను వార్డ్ మెంబర్ తుమ్మకొమ్మ నాగయ్య గ్రామసభ జనరల్ బాడీ సమావేశంలో సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. సమస్య పరిష్కారం దిశగా కనీస చర్యలు లేకపోవడంపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.




ఎండాకాలంలో నీటి వృథా… బాధ్యత ఎక్కడ?





ఇప్పటికే ఎండాకాలం నేపథ్యంలో అనేక గ్రామాల్లో తాగునీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, లింగగిరిలో మాత్రం నీరు వృథాగా పోవడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అత్యవసర సమయంలోనూ స్పందించని పాలకవర్గంపై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.




తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్





ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు స్పందించి పైపు లైన్‌ను మరమ్మతు చేసి నీటి వృథాను అరికట్టాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనలకు దిగే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.

🏠 Home