🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 02 March 2026, 12:11 am Posted by : DAINAMIC NEWS

సహజసిద్ధమైన రంగులతో హోళీ జరుపుకోవాలి: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రశాంత వాతావరణంలో హోళీ వేడుకలు నిర్వహించాలి

News Image

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 2




నల్లగొండ జిల్లాలో రేపు నిర్వహించుకోనున్న హోళీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. హోళీ వేడుకలను సాంప్రదాయబద్ధంగా, పరస్పర గౌరవంతో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు.




హానికర రసాయనిక రంగులకు దూరంగా ఉండాలి




హోళీ సందర్భంగా సహజసిద్ధమైన రంగులను మాత్రమే వినియోగించాలని, రసాయనిక రంగులను వాడకూడదని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ప్రార్థనా మందిరాలు, ప్రజా ప్రదేశాలు, రహదారులపై వాహనదారులకు ఆటంకం కలిగించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని తెలిపారు.




మహిళల భద్రతకు ప్రత్యేక నిఘా




హోళీ వేళ మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం జిల్లాలో షీ టీమ్ బృందాలను మోహరింపజేసి, ప్రధాన కూడళ్లతో పాటు జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.




డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు




పండుగ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత అతివేగంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.




నీటి వనరుల వద్ద అప్రమత్తత అవసరం




ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. చిన్నపిల్లలను అటువంటి ప్రదేశాలకు తీసుకెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.




అపోహలు సృష్టిస్తే కఠిన చర్యలు




పండుగ వేళ ఎవరైనా గొడవలు సృష్టించినా, అసత్య ప్రచారం చేసినా, సామాజిక మాధ్యమాల ద్వారా అపోహలు వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.జిల్లా ప్రజలందరూ కలిసిమెలిసి, సురక్షితంగా హోళీ పండుగను జరుపుకొని పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు.

🏠 Home