🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 24 February 2026, 6:04 am Posted by : DAINAMIC NEWS

హుజూర్నగర్‌లో 2,160 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం మార్చి మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం

News Image

హుజూర్ నగర్, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 24




రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట 2,160 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదలకు అందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం హుజూర్నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాలలో రూ.125 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు.




14 ఏళ్ల పట్టుదల ఫలితం




అనంతరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, 2011లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, కార్మికులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో దేవాలయ భూములను మార్కెట్ ధరకు కొనుగోలు చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత పనులు నిలిచిపోయాయని, తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తన పట్టుదలతో పనులను పునఃప్రారంభించి పూర్తి దశకు తీసుకువచ్చామని చెప్పారు.




ఒక్కో ఫ్లాట్‌కు రూ.6 లక్షల వ్యయం




ప్రతి ప్లాట్ విస్తీర్ణం 325 చదరపు అడుగులు ఉండగా, ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.6 లక్షలు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అదనంగా రూ.75 కోట్లతో అంతర్గత రోడ్లు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.




మొదటి విడతలో 1000 మందికి ఇండ్ల పంపిణీ




మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మొదటి విడతలో హుజూర్నగర్ ప్రాంతానికి చెందిన 1000 మంది నిరుపేదలకు ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. రెండో విడతలో నియోజకవర్గంలోని ఇతర అర్హులైన పేదలకు అందజేయనున్నట్లు తెలిపారు.




లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత




లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, చైర్‌పర్సన్, తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవినీతి, అవకతవకలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ కే. నరసింహ, మున్సిపల్ చైర్‌పర్సన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.









🏠 Home