డైనమిక్ ,నల్లగొండ బ్యూరో , అక్టోబర్ 25
ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ వారి మెడల్లో ఉన్న బంగారు పుస్తెల తాళ్లు లాక్కొని పారిపోయే చైన్ స్నాచర్‌ను నార్కెట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి 9.5 తులాల బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ సుమారు 15 లక్షలు.
నిందితుడి వివరాలు
పోలీసుల ప్రకారం, నిందితుడు బొలుగూరి శివ (వయసు 24 సంవత్సరాలు), ఆటో డ్రైవర్, పులిపలుపుల గ్రామం, మునుగోడు మండలం, నల్లగొండ జిల్లా వాసి. చెడు వ్యసనాలకు బానిసై, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
సంఘటన ఎలా జరిగింది
ఈ నెల 18న నార్కెట్‌పల్లి మండలం దాసరిగూడెం గ్రామానికి చెందిన ఉప్పుల సునీత తన పత్తి చేనులో పని చేస్తుండగా, నిందితుడు బైక్‌పై వచ్చి ఆమెతో మాటల్లో పెట్టి, మెడలోని మూడు తులాల బంగారు తాడు లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. బాధితురాలు గట్టిగా అరవడంతో పొలగాని సైదులు, ఉప్పుల మోహన్ రెడ్డి అనే గ్రామస్థులు వెంటనే అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
కేసు నమోదు – దర్యాప్తు వేగం
బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా పోలీసు అధికారి శరత్ చంద్ర పవార్ సూచనలతో, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో, నార్కెట్‌పల్లి సిఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ క్రాంతి కుమార్, సిబ్బంది కలిసి విచారణ చేపట్టారు.
ఏడు కేసులు చేదించిన పోలీసులు
విచారణలో నిందితుడు మొత్తం ఏడు కేసుల్లో (ఐదు చైన్ స్నాచింగ్‌లు, రెండు బైక్ దొంగతనాలు) పాల్పడినట్టు తేలింది.వీటిలో నల్లగొండ రూరల్, మునుగోడు, నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన కేసులు ఉన్నాయి.
స్వాధీనం చేసిన వస్తువులు
నిందితుడి వద్ద నుండి పోలీసులు 9.5 తులాల బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 15.35 లక్షలు.
నిందితుడు పాల్పడిన కేసులు
నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ కేసు నం. 35/2025 నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ కేసు నం. 194/2025 నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ కేసు నం. 359/2025 నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ కేసు నం. 364/2025 నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ కేసు నం. 137/2024 నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ కేసు నం. 155/2025 నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ కేసు నం. 205/2025 మునుగోడు పోలీస్ స్టేషన్ కేసు నం. 96/2025


పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు
కేసును విజయవంతంగా ఛేదించి బంగారు ఆభరణాలు, బైకులు రికవరీ చేసిన పోలీసు బృందాన్ని జిల్లా పోలీసు అధికారి శరత్ చంద్ర పవార్ అభినందించారు.
ఈ బృందంలో నార్కెట్‌పల్లి ఎస్ఐ క్రాంతి కుమార్, ఏఎస్ఐ ఆంజనేయులు, హెచ్‌సీ జవహర్, రమేష్, జానీ పాషా, సత్యనారాయణ, గిరిబాబు, శ్రీకృష్ణ, సురేష్ గౌడ్ ఉన్నారు.
