సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 1
హోలీ పండుగను సంతోషకర వాతావరణంలో, కలిసిమెలిసి, శాంతియుతంగా జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ విజ్ఞప్తి చేశారు. హోలీ సందర్భంగా ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని, ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించవద్దని సూచించారు.రంగులు చల్లుకునే సమయంలో పరిసరాలను గమనించాలని, ఇష్టపడని వ్యక్తులపై బలవంతంగా రంగులు చల్లరాదని స్పష్టం చేశారు. రహదారులపై క్రమశిక్షణతో వ్యవహరించాల్సిందిగా కోరారు.
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని, మద్యం మత్తులో వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. హోలీ ఉత్సవం విషాదంగా మారకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు.
సంప్రదాయ రంగులకు ప్రాధాన్యం
రసాయన రంగులు ఆరోగ్యానికి హానికరమని, సంప్రదాయ రంగులతోనే హోలీ జరుపుకోవాలని సూచించారు. నివాసాలు, ప్రార్థనా మందిరాలపై రంగులు చల్లరాదని తెలిపారు. పండుగ అనంతరం లోతైన నీటి ప్రదేశాలు, ప్రవాహం ఉన్న కాల్వల్లో ఈతకు వెళ్లరాదని హెచ్చరించారు.
మహిళలు, పిల్లల పట్ల జాగ్రత్త అవసరం
మహిళలను గౌరవించాలని, పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. తొందరపాటు, అత్యుత్సాహం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని కోరారు.
గుంపులుగా వాహనాల కదలికలపై నిషేధం
వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా ద్విచక్ర వాహనాలు మరియు ఇతర వాహనాల కదలికలను నిషేధించినట్లు తెలిపారు. ఇవి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్నారు.
జిల్లా వ్యాప్తంగా నిషేధాజ్ఞలు అమల్లో
జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని, గుంపులుగా చేరడం, సభలు, సమావేశాలు, ఊరేగింపులపై నిషేధాజ్ఞలు ఉన్నాయని గుర్తు చేశారు. పోలీసు సూచనలు, నియమాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
