డైనమిక్ న్యూస్, సూర్యాపేట బ్యూరో, మార్చి 15
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంగణంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మాట్లాడుతూ, 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాలలో భాగంగా పోలీస్ శాఖ తరఫున వాహనదారులు, డ్రైవర్లు మరియు ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.వాహనాలు నడిపేటప్పుడు ముందున్న పరిస్థితులు, అడ్డంకులు, ఇతర వాహనాల కదలికలను జాగ్రత్తగా గమనించాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. అలాగే తప్పు మార్గంలో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని హెచ్చరించారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించుకోవాలని, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం కోరారు.
అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, వాహన డ్రైవర్లు, ప్రజలు పాల్గొన్నారు.
