నల్గొండ బ్యూరో, నవంబర్ 17 , డైనమిక్ న్యూస్
జిల్లాలో ఇటీవల ఆడపిల్లల అక్రమ దత్తత, బాల్య వివాహాలు, లింగ నిర్ధారణ పరీక్షలు, చిన్న వయసులో గర్భం దాల్చడం వంటి సంఘటనలుప్రబలుతున్నాయని, ఇవి అత్యంత ఆందోళనకరమని జిల్లా కలెక్టర్ ఇలాఏ త్రిపాఠి తెలిపారు.
విసిపిసి కమిటీలకు బలం — ప్రతి గ్రామంలో తప్పనిసరి సమావేశాలు
కలెక్టర్ కార్యాలయంలో జరిగిన “సేవ్ ద చైల్డ్” జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడుతూ గ్రామ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను (VSCPC) బలోపేతం చేయాలని, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, గ్రామపాలన అధికారులను చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా నియమించాలని ఆదేశించారు.లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని, సమాచారం వెంటనే చేరే విధంగా ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు.
సున్నిత మండలాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు
పెద్దవూర, తిరుమలగిరి సాగర్, దామరచర్ల, పీఏ పల్లి మండలాల్లో సంఘటనలు అధికంగా జరుగుతున్నందున అక్కడ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.బాలికలతో పాటు బాలుర పాఠశాలల్లోనూ చట్టాలు, భద్రతపై అవగాహన కల్పించాలని అన్నారు.
ప్రతి పంచాయతీలో ‘దోస్తు బాక్సులు’ ఏర్పాటు
బాల్య వివాహాలు, అక్రమ దత్తత, ఇతర దుర్వినియోగ అంశాలపై గ్రామస్థులు నేరుగా సూచనలు, ఫిర్యాదులు అందించేందుకు ప్రతి గ్రామపంచాయతీలో ‘దోస్తు బాక్సులు’ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమాల్లో సిడిపిఓలు, సూపర్వైజర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు.
ఆడపిల్ల ఇంటికి బలం — ఎస్పీ పవార్
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ఆడపిల్లల రక్షణపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.పాఠశాలలు, హాస్టళ్లలో బాలికలతో పాటు బాలురకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, “ఆడపిల్ల ఇంటికి బలం” అనే సందేశాన్ని ప్రజల్లో బలంగా వ్యాప్తి చేయాలని సూచించారు.
అధికారుల హాజరు
సమావేశంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షుడు కృష్ణ, అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీఓ రమణారెడ్డి, సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీఈవో బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
