నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,నవంబర్18
నషాముక్త్ భారత్ అభియాన్‌కు ఐదేళ్లు – జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ భారత్ అభియాన్ ఐదేళ్లు పూర్తై సందర్భంగా, నల్లగొండ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యాసంస్థల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచనల మేరకు, పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాలలు–కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలు శారీరక, మానసిక, సామాజికంగా ఎలా దెబ్బతీస్తాయో, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టపరమైన శిక్షాంశాలు వంటి కీలక అంశాలను అధికారులు వివరించారు.
“డ్రగ్స్‌కు దూరంగా ఉంటాం” – విద్యార్థుల ప్రతిజ్ఞ
ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులు—
“డ్రగ్స్‌కు దూరంగా ఉంటాం. మిత్రులు, పరిసరాల్లోని యువతలో కూడా అవగాహన పెంచుతాం. ఎక్కడైనా డ్రగ్స్ విక్రయం, కొనుగోలు, అక్రమ రవాణా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తాం” అని ప్రతిజ్ఞ చేశారు.డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములమవుతామని విద్యార్థులు ప్రకటించడం కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకువచ్చింది.
యువత భవితవ్యాన్ని నాశనం చేసే మత్తు పదార్థాలు : ఎస్పీ
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ—
“మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును తీవ్రమైన దెబ్బతీస్తున్నాయి. యువతలో మత్తు నిరోధక సంకల్పాన్ని పెంపొందించడం అత్యవసరమైంది. దీనిని సమాజం మొత్తం కలిసి ముందుకు తీసుకెళ్లాలి” అన్నారు.జిల్లాలో మత్తు నియంత్రణకు సంబంధించి పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ సెషన్లు కొనసాగుతాయని, డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు కీలకం
మాదక ద్రవ్యాల నిర్మూలనలో కుటుంబం, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత ముఖ్యమని ఎస్పీ పేర్కొన్నారు.తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించి, అవసరమైతే వెంటనే సలహా ఇవ్వాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమాజం మొత్తం కలిసి పనిచేసినప్పుడే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యం” అని పిలుపునిచ్చారు.
