డైనమిక్ ,నేరేడుచర్ల, అక్టోబర్ 19
బీసీ బిల్లును షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చకుండా బీసీలకు తీవ్ర ద్రోహం చేసిన బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు.ఆదివారం నాడు నేరేడుచర్లలోని బీసీ హక్కుల సాధన సమితి కార్యాలయంలో బీసీ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన బీసీ బంద్‌లో బీజేపీ పార్టీ పాల్గొనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. “బీసీల హక్కులను అడ్డుకున్న వారే బీసీల బంద్‌కు మద్దతు ఇస్తే — అది ‘దొంగే దొంగ అని అరిచినట్టే’ ఉంటుంది,” అని ధనుంజయ నాయుడు వ్యాఖ్యానించారు.ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చకపోతే, రాష్ట్రవ్యాప్తంగా బీసీల అస్తిత్వ ఉద్యమాలు మరింత ఉధృతమవుతాయని ఆయన హెచ్చరించారు.ప్రస్తుతం బీసీలకు ప్రధాన శత్రువులు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ బీసీలు ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్తారు,” అని ధనుంజయ నాయుడు తెలిపారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్‌ఎస్ అగ్రవర్ణాలకు టికెట్లు ఇచ్చినప్పటికీ, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీ అభ్యర్థిని నిలబెట్టిందని, ఆయనను గెలిపించడం ప్రతి బీసీ ఓటరి బాధ్యత అని పిలుపునిచ్చారు.ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బీసీ బంద్ విజయవంతానికి సహకరించిన ప్రజలందరికీ, వ్యాపారవేత్తలకు, ఉద్యోగ వర్గానికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు చిలకరాజు శ్రీను, జిల్లా సహాయ కార్యదర్శి కోమర్రాజు వెంకట్, దీకొండ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
