గురజాల, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 16
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండలం రెమిడిచర్ల గ్రామానికి చెందిన డాక్టర్ హనుమానాయక్‌కు ఉత్తమ ఫిజియోథెరపిస్ట్ అవార్డు లభించింది. అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన సదరన్ ఫిజియో వార్షిక పరిశోధన–సాంస్కృతిక సమావేశంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు.
లేజర్ ఫిజియోథెరపీలో విశేష సేవలు
ప్రస్తుతం అంబాజీపేట పెద్దవీధిలోని శ్రీ లక్ష్మి అడ్వాన్స్ లేజర్ ఫిజియోథెరపీ & రిహాబిలిటేషన్ హాస్పిటల్లో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ హనుమానాయక్, ఆధునిక లేజర్ ఫిజియోథెరపి ద్వారా అనేకమందికి నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నారు. రోగుల వేగవంతమైన కోలికలో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.
పదేళ్లుగా నిరంతర వైద్య సేవలు
గత పది సంవత్సరాలుగా వైజాగ్, రాజమహేంద్రవరం, ఏలూరు, అమలాపురం, రావులపాలెం, అంబాజీపేట, పి.గన్నవరం తదితర ప్రాంతాల్లో ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందారు. ఈ ప్రాంతంలో ఫిజియోథెరపీ విభాగంలో ఆయనకు ఉన్న మంచి పేరే ఈ గౌరవానికి కారణమని నిర్వాహకులు పేర్కొన్నారు.
కుటుంబ సహకారంతోనే ఈ స్థాయికి
డాక్టర్ హనుమానాయక్ స్వస్థలం పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం రెమిడిచర్ల గ్రామం. తల్లిదండ్రులు పెద్దకోటేశ్వరరావు నాయక్, లక్ష్మీబాయి, అలాగే అన్నయ్య బాబు నాయక్, తమ్ముడు వెంకటేశ్వర్లు నాయక్ అందించిన ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన తెలిపారు.
పల్నాడులో ఫిజియోథెరపీ కేంద్రం ఏర్పాటు లక్ష్యం
త్వరలో స్వగ్రామమైన పల్నాడు ప్రాంతంలో ఫిజియోథెరపీ సెంటర్ ఏర్పాటు చేసి, స్థానిక ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో ఉన్నట్లు డాక్టర్ హనుమా నాయక్ మీడియాకు వెల్లడించారు.
అభినందనల వెల్లువ
ఉత్తమ వైద్యునిగా అవార్డు అందుకున్న పల్నాడు ప్రాంత యువ వైద్యుడు డాక్టర్ హనుమా నాయక్‌ను పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యులు, స్నేహితులు అభినందించారు.
