హైదరాబాద్, డైనమిక్ డెస్క్,అక్టోబర్ 21
మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే నకిలీ ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ విషయం మీద ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు జాగ్రత్త సూచించారు.
సజ్జనార్ తెలిపారు —
“కొంతమంది సైబర్ నేరగాళ్లు తల్లిదండ్రుల భయాన్ని వాడుకుంటున్నారు. మీ పిల్లల పేర్లు చెప్పి, వారు ఏడుస్తున్నట్లు రికార్డింగ్ వినిపిస్తూ మోసం చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి సందర్భాల్లో మానసిక ఆందోళనకు గురై భయపడకండి” అని సూచించారు.“అత్యాశ, భయం — ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరాలు” అని వ్యాఖ్యానించిన ఆయన, ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే అవగాహనతో కూడిన అప్రమత్తత అవసరమని చెప్పారు.అలాగే, పిల్లలు లేదా బంధువుల వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవద్దని సజ్జనార్ సూచించారు. “బెదిరింపు లేదా అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి” అని విజ్ఞప్తి చేశారు.అలాంటి సందర్భాల్లో హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయవచ్చని, లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు సూచించారు.
