డైనమిక్, మాచర్ల, అక్టోబర్ 28
మొంథా తుపాను ప్రభావంపై కూటమి ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్య పడవద్దని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థలు సంయుక్తంగా ఇచ్చిన నివేదికల ఆధారంగా తుపాను వల్ల సంభవించే నష్టాన్ని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసిందని చెప్పారు.రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రోజువారీగా పరిస్థితులను సమీక్షిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా టోల్ ఫ్రీ నంబర్లు జారీ చేసిందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.మాచర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులను అప్రమత్తం చేశామని, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా నేతృత్వంలో నిరంతర మానిటరింగ్ కొనసాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. తుపానుతో ప్రభావితులైన ప్రజలకు సహాయం అందించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి మండలానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లను కేటాయించినట్లు చెప్పారు.ప్రజలు ఏ సమయంలోనైనా ఈ నంబర్లకు సంప్రదించి సహాయం పొందవచ్చని తెలిపారు. అదేవిధంగా అధికారులతో పాటు కూటమి ప్రభుత్వం కార్యకర్తలు కూడా ప్రజా సేవా కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
మండలాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు:
📞 కారంపూడి మండలం – 70930 04566
📞 దుర్గి మండలం – 95732 71041
📞 రెంటచింతల మండలం – 99899 91002
📞 వెల్దుర్తి మండలం – 63005 02015
📞 మాచర్ల మండలం – 63028 17715
📞 మాచర్ల మున్సిపాలిటీ – 98499 05838
