పాలకవీడు, నవంబర్ 24 (డైనమిక్ న్యూస్)
పాలకవీడు మండల సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సామాజిక కార్యకర్త నక్క శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. మండలంలోని మొత్తం 22 గ్రామపంచాయతీల్లో ఒక్క గ్రామపంచాయతీకి కూడా బీసీ రిజర్వేషన్ కేటాయించక పోవడం తీవ్ర అన్యాయమని ఆయన పేర్కొన్నారు.
బీసీ జనాభా ఉన్న ప్రాంతాల్లో జనరల్ రిజర్వేషన్లు
బీసీ జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో కూడా జనరల్ రిజర్వేషన్లు కేటాయించటం అతి పెద్ద లోపమని, ఇది బీసీ వర్గాల అవకాశాలను హరించినట్లేనని శ్రీనివాస్ లేఖలో తెలిపారు.
జీవో 46, రొటేషన్ ప్రమాణాలు పాటించలేదని ఆరోపణ
జీవో 46 ప్రకారం అమలు చేయాల్సిన రొటేషన్ పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు కేటాయించలేదని, బీసీ డెడికేషన్ కమిటీ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రిజర్వేషన్ల పునర్విమర్శ చేయాలని విజ్ఞప్తి
ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్లను వెంటనే నిలిపివేసి పునర్విమర్శ చేసి కొత్త రిజర్వేషన్లు ప్రకటించాలని ఈసీని కోరారు. లేని పక్షంలో గౌరవ తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తానని శ్రీనివాస్ హెచ్చరించారు.
