డైనమిక్ డెస్క్ ,ఎపీ కర్నూలు బ్యూరో, అక్టోబర్ 24
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో ఆవిరై పలువురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్ బస్సు (నంబర్ DD 01 N 9490) ఓ బైక్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని కిరణాలు చెలరేగిన వేగం కారణంగా పలువురు ప్రయాణికులు బయటపడలేక బస్సులోనే చిక్కుకుని దగ్ధమయ్యారు.ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఎమర్జెన్సీ డోర్‌ను పగలగొట్టి 12 మంది బయటపడగా, 11 మందిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మరికొందరి ఆచూకీ కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది శోధన చర్యలు కొనసాగిస్తున్నారు. పొగ గమనించిన స్థానికులు వెంటనే బస్సు అద్దాలను పగలగొట్టి సహాయక చర్యలు చేపట్టారు. అయితే మంటలు విపరీతంగా వ్యాపించడం వల్ల కొందరిని రక్షించలేకపోయారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు
“బెంగళూరు వెళ్తున్న బస్సు ఒక టూవీలర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు బయటపడలేకపోయారు. రెండో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం. ప్రమాదంపై ఎఫ్‌ఎస్ఎల్ బృందం దర్యాప్తు కొనసాగిస్తోంది” అని ఎస్పీ తెలిపారు.
కలెక్టర్ సిరి వివరాలు:
“ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నాడు. 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటివరకు 11 మృతదేహాలు వెలికితీశాం. బైక్ బస్సు కిందకు వెళ్లడంతో డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయింది. 20 మంది ప్రయాణికులు ఇంకా మిస్‌గా ఉన్నారు” అని కలెక్టర్ సిరి తెలిపారు.
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి స్పందన:
“ప్రమాదం రాత్రి 3 గంటల సమయంలో జరిగింది. బస్సులో సుమారు 40 మంది ఉన్నారు. మరో గంటలో ప్రమాదంపై పూర్తి స్పష్టత వస్తుంది. కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు” అని మంత్రి చెప్పారు.ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం:
కర్నూలు బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం ఈ ఘటన వివరాలను సీఎస్ మరియు ఉన్నతాధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఘటనా స్థలానికి ఉన్నత స్థాయి బృందం వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందించి, మృతుల కుటుంబాలకు సహాయం అందించాలన్నారు. “మృతుల సంఖ్య పెరగకుండా చర్యలు తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం
కర్నూలు బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం ఈ ఘటన వివరాలను సీఎస్ మరియు ఉన్నతాధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఘటనా స్థలానికి ఉన్నత స్థాయి బృందం వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందించి, మృతుల కుటుంబాలకు సహాయం అందించాలన్నారు. “మృతుల సంఖ్య పెరగకుండా చర్యలు తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
నారా లోకేష్ స్పందన
విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి పలువురు ప్రాణాలు కోల్పోవడం హృదయవిదారకం. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని పేర్కొన్నారు.


ప్రమాదం తర్వాత పరిస్థితి
ఘటనాస్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కర్నూలు ఆస్పత్రిలో గాయపడిన 11 మందికి చికిత్స అందిస్తున్నారు. అధికారులు శవాలను గుర్తించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
