Tuesday, January 13, 2026
Homeఆంధ్ర ప్రదేశ్పెయ్యిదూడల పుట్టుకకు లింగ నిర్ధారిత వీర్యం వినియోగంపై అవగాహన నూజెండ్లలో ఉచిత గర్భకోశ చికిత్సా శిబిరం

పెయ్యిదూడల పుట్టుకకు లింగ నిర్ధారిత వీర్యం వినియోగంపై అవగాహన నూజెండ్లలో ఉచిత గర్భకోశ చికిత్సా శిబిరం

వినుకొండ, నూజెండ్ల, డైనమిక్ అక్టోబర్ 17

పాడిపశువుల్లో పెయ్యిదూడల పుట్టుకకు లింగ నిర్ధారిత వీర్యం వినియోగాన్ని ప్రోత్సహించడానికి, అలాగే పశువుల్లో గర్భకోశ వ్యాధుల నివారణకు ఉద్దేశించి నూజెండ్ల మండలం ముక్కెల్లపాడు గ్రామంలో ఉచిత గర్భకోశ చికిత్సా శిబిరం శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. వినుకొండ ప్రాంత పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ నెలవల్లి శ్రీరాములు ఆధ్వర్యంలో, జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ సహకారంతో, రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం కింద ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్ద సింగంశెట్టి వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ పి. రామారావు, సంయుక్త సంచాలకుడు డాక్టర్ టి.వి. సుధాకర్, గుంటూరు జిల్లా కార్యనిర్వహణ అధికారి డాక్టర్ వై. సుధాకర్ ప్రారంభించారు.డాక్టర్ వై. సుధాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం సరఫరా చేస్తున్న లింగ నిర్ధారిత వీర్యం ద్వారా 90 శాతం వరకు పెయ్యిదూడలు పుట్టే అవకాశం ఉందని తెలిపారు. విదేశీ జాతులతో పాటు గిర్, సాహివాల్, తార్పర్కార్ వంటి స్వదేశీ జాతుల వీర్యం కూడా అందుబాటులో ఉందని చెప్పారు. పెయ్యిదూడ పుట్టడం వల్ల ఆవులకు ప్రసవ సమయంలో ఇబ్బంది తక్కువగా ఉంటుందని, ఆ దూడలు పెద్దయ్యాక 20 శాతం ఎక్కువ పాలు ఇస్తాయని వివరించారు. భవిష్యత్తులో ఈ సాంకేతిక విధానం పాడిపశుసంవర్ధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యమన్నారు.శిబిరంలో సుమారు 45 పశువులకు గర్భకోశ పరీక్షలు నిర్వహించి తగు చికిత్స అందించారు. తిరిగి ఎదకు రాని లేదా నిలిచిపోయిన పశువులకు పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇచ్చారు. 47 పశువులకు నట్టల నివారణ మందులు, 21 సాధారణ కేసులకు వైద్యం అందించారు. రైతుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి, పశువుల్లో ఎద లక్షణాలను గుర్తించడం, సరైన ఆహారం, పచ్చి మేతతో పాటు కొండ చిగిరాకు, మునగాకు, కరివేపాకు, మొలకెత్తిన పెసలు వంటి దాణా పదార్థాల ప్రాముఖ్యత వివరించారు. చూలు కట్టిన తర్వాత ఆవుకు బెల్లం నీళ్లు, టెంకాయ నీళ్లు, ఎముకల పొడి వాడకం వంటి సూచనలు ఇచ్చారు.గర్భకోశ వ్యాధులు, ఎద లక్షణాలు, చూడి పశువుల సంరక్షణపై డాక్టర్ టి.వి. సుధాకర్ శిక్షణ ఇచ్చారు. పశువైద్య సహాయకులు, గోపాల మిత్రులు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు. దాదాపు పది మంది పశుసంవర్ధక సహాయకులు ప్రాయోగిక శిక్షణ పొందారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శివాజీ, డాక్టర్ అమీర్ బాషా, డాక్టర్ మనోజ్, హెనరీ, నాగరాజు తదితరులు వైద్య సేవలు అందించారు. గ్రామ పెద్దలు, రైతులు, పశువైద్యులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments