నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 23
న్యాయవ్యవస్థలో కేసుల భారాన్ని తగ్గించి వేగవంతమైన న్యాయాన్ని అందించడంలో మధ్యవర్తిత్వం (మెడియేషన్) కీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ హైకోర్టు జడ్జ్ జస్టిస్ కె. లక్ష్మణ్ అన్నారు.
నల్గొండలో న్యాయవాదుల కోసం ఐదు రోజుల మెడియేషన్ శిక్షణా తరగతుల ప్రారంభం
ఆదివారం నల్లగొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో, ఉమ్మడి నల్గొండ జిల్లా న్యాయవాదులకు ఉద్దేశించిన ఐదు రోజుల మధ్యవర్తిత్వ శిక్షణా కార్యక్రమాన్ని జస్టిస్ లక్ష్మణ్ ప్రారంభించారు.
“కుటుంబ, ఆస్తి, వాణిజ్య కేసులకు మెడియేషన్ ఉత్తమ మార్గం”
తరువాత న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడిన జస్టిస్ లక్ష్మణ్ —
నేటి సమాజంలో కుటుంబ విభేదాలు, ఆస్తి వివాదాలు, వాణిజ్య కేసులు, వ్యక్తిగత చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం అత్యంత అనుకూలమైన మార్గంగా మారిందని చెప్పారు.కోర్టుల్లో విచారణ పూర్తిచేయడానికి ఎక్కువ సమయం పడుతున్న సమయంలో, మధ్యవర్తిత్వం ద్వారా కోర్టుల బయటే పరస్పర అంగీకారంతో వేగంగా సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఇది సంబంధాలను కాపాడుతుందని, సమయం-ధనాన్ని ఆదా చేస్తుందని, గెలుపో ఓటమో కాదని, పరస్పర అవగాహన ద్వారానే అసలు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
శిక్షణా తరగతులను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి
నైపుణ్యం కలిగిన శిక్షకులు అందుబాటులో ఉన్న ఈ శిక్షణను న్యాయవాదులు పూర్తిగా సద్వినియోగం చేసుకొని, కేసులు త్వరగా పరిష్కారమయ్యే దిశగా ముందడుగు వేయాలని ఆయన సూచించారు.
హైకోర్టు జడ్జికి ఘన స్వాగతం
కార్యక్రమానికి రాకతోనే రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఆర్డీవో వై. అశోక్ రెడ్డీలు జస్టిస్ లక్ష్మణ్‌కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.
కార్యక్రమంలో ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమానికి మెంబర్ సెక్రటరీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ–డైరెక్టర్, మీడియేషన్ అండ్ అబ్జర్వేషన్ సెంటర్, హైదరాబాద్ సి.హెచ్. పంచాక్షరి,
నల్గొండ జిల్లా జడ్జి కవిత,యాదాద్రి జిల్లా జడ్జి జయరాజు పురుషోత్తం,జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి,నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంత రెడ్డి,జీపి నాంపల్లి నరసింహ తోపాటు అనేక మంది న్యాయవాదులు పాల్గొన్నారు.
