డైనమిక్ ,మంగళగిరి, నవంబర్ 15
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశగామంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ప్రయత్నాల్లో భాగంగా, మంగళగిరి మార్కెట్ యార్డ్‌లో ఏటిబి (ఎనీ టైం బ్యాగ్) మిషన్లను శనివారం కూటమి నాయకులు ప్రారంభించారు. రైతు బజార్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ మిషన్లు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహించనున్నాయి.
పర్యావరణహిత బ్యాగుల వినియోగం అవసరం
ఈ కార్యక్రమానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ అలీంభాష, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు నల్లగొండ పరమేశ్వరరావు, బైరబోయిన పద్మావతి, బైరబోయిన శ్రీనివాసరావు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అధికారులు మాట్లాడుతూ —
ప్లాస్టిక్ క్యారిబ్యాగులు నేలలో కలిసి పోవడానికి వందేళ్లకు పైగా సమయం పడుతుందని, వాటి వల్ల నేల సారానికి నష్టం, జంతువుల ప్రాణాలకు ముప్పు వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా తగ్గించి, క్లాత్ బ్యాగులు వంటి పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను తప్పనిసరిగా ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.
పది రూపాయలతో బ్యాగ్ – ఏటిబి మిషన్ ప్రత్యేకత
ఏటిబి మిషన్లలో పది రూపాయల నాణెం వేస్తే వెంటనే బ్యాగు అందే విధంగా సదుపాయం కల్పించారని అధికారులు వివరించారు. ప్రజలు ఈ మిషన్లను వినియోగించి శుభ్రత కార్యక్రమంలో భాగస్వాములవాలని పిలుపునిచ్చారు.
