కర్ణాటక,డైనమిక్ డెస్క్,నవంబర్2
బెంగళూరు నగరంలోని రద్దీ రోడ్లలో చోటుచేసుకున్న ఓ విచిత్ర దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు హెల్మెట్ లేకుండా వెళ్తున్న సమయంలో పోలీసుల దృష్టికి పడకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.వైరల్ వీడియోలో ఇద్దరు యువకులు బైక్‌పై ప్రయాణిస్తుండగా, ముందు కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నాడు. అయితే వెనుక సీట్లో ఉన్న వ్యక్తి తలకు హెల్మెట్ బదులు వంటగదిలో ఉపయోగించే కడాయి పెట్టుకున్నాడు. కడాయి తలపై పెట్టుకొని వెళ్తున్న దృశ్యాన్ని చూసి అక్కడి ప్రజలు వీడియో తీశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. “ఎవర్రా నువ్వు ఇలా ఉన్నావ్?” అంటూ ఒకరు కామెంట్ చేస్తే, “ఫ్రయింగ్ పాన్‌తో ఆమ్లెట్ చేయవచ్చు కానీ ప్రాణాన్ని కాపాడలేము” అంటూ మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు. ఇంకొంతమంది “హెల్మెట్ అనేది ఫ్యాషన్ ఐటమ్ కాదు, ప్రాణ రక్షణ సాధనం” అని గుర్తుచేస్తూ ఇలాంటి జుగాడ్‌లు ప్రాణాలతో ఆటలు ఆడటమేనని వ్యాఖ్యానించారు.ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు మరోసారి హెచ్చరిక జారీ చేస్తూ, హెల్మెట్ ధరించడం కేవలం చలాన్ నుంచి తప్పించుకోవడానికే కాదు, జీవన భద్రతకై తప్పనిసరి అని స్పష్టం చేశారు.
