డైనమిక్, నేరేడుచర్ల, నవంబర్ 15
నేరేడు చర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలోని అవని వడ్ల మిల్లు మోసం వెలుగు లోకి వచ్చింది. వడ్ల తూకంలో సిస్టమేటిక్‌గా క్వింటా తేడా చూపిస్తూ రైతుల ధాన్యాన్ని దోచుకుంటున్నారనే ఆరోపణలు చేస్తున్న రైతులు.రైతులు తాము తెచ్చిన ప్రతి బండి ధాన్యంలో ఒక క్వింటా చొప్పున తక్కువ చూపిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్వింటా తేడా… రైతుల కోపం ఉధృతం
శనివారం ధాన్యం అమ్మిన కొండ ముసలయ్య, పేరం రాజు, కొండ సత్యనారాయణ, బొరుగుల లింగయ్య, కొండ శీను, జడ లింగయ్య, కంపసడి లక్ష్మయ్య లాంటి పలువురు రైతులకి ఒకే సమస్య ఎదురైంది.అవని మిల్లులో తూకం వేయగా ఒక్కో బండి నుంచి క్వింటా వడ్లు తక్కువగా చూపించారు. అదే ధాన్యాన్ని మరో మిల్లులో వేయించగా పూర్తి తూకం వచ్చినట్టు రైతులు చెబుతున్నారు. “ఏడాది పొడవునా కష్టపడి పండించిన ధాన్యాన్ని ఇలా దోచేస్తే మేమేం చేసుకోవాలి?” అంటూ రైతులు ఆగ్రహంతో మాట్లాడుతున్నారు.
గిట్టుబాటు లేకున్నా… పైగా దోపిడీ!
ధాన్యంలో గిట్టుబాటు ధర కూడా రాకపోయే పరిస్థితుల్లో ఇంకా తూకం తగ్గించి మోసం చేయడం రైతుల్లో తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.“మా పొట్టకూటికి కోత పెట్టే మిల్లులను నిలదీయాలి” అని రైతులు అంటున్నారు.
అధికారులు ఎక్కడ? సీజన్‌లోనూ తనిఖీలు లేవా?
ఈ ఘటనలో మిల్లుతో పాటు అధికారులు కూడా బోనులోనే ఉన్నారు అని రైతులు మండిపడుతున్నారు.సీజన్ ప్రారంభమైనా రైతులు ధాన్యం అమ్మకాలు ప్రారంభించినా మిల్లులు ఫుల్ రన్‌లో ఉన్నా తూనికల & కొలతల శాఖ అధికారులు ఒకసారి కూడా తనిఖీ చేయలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.సీజన్ సమయంలో వే బ్రిడ్జి, కంటాలు తప్పనిసరిగా చెక్ చేయాలి. కానీ అధికారులు ఒక్క అడుగు కూడా వేయలేదు. ఇది నిర్లక్ష్యం కాదా?” అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారుల ఈ నిర్లక్ష్యం కారణంగానే
మిల్లులు బలహీనమైన రైతుల్ని ఇష్టానికి దోపిడీ చేస్తున్నాయి అని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
జిల్లా కలెక్టర్ జోక్యం కావాలి – రైతుల డిమాండ్
అవని మిల్లులో జరుగుతున్న అనుమానాస్పద తూకం వ్యవహారంపై వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. అధికారులు అకస్మిక తనిఖీలు చేయాలి,తూకం వ్యవస్థను టెస్ట్ చేయాలి,తప్పు చేసిన మిల్లుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి,నిర్లక్ష్యంగా ఉన్న తూనికల శాఖ అధికారులపై కూడా విచారణ చేయాలి,అని రైతులు మరియు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
“మిల్లుల దోపిడీకి అధికారులు కూడా బాధ్యులే” – రైతు సంఘాలు
స్థానిక రైతు సంఘాలు కూడా తీవ్రంగా స్పందిస్తూ “మిల్లులో మోసం జరుగుతోందంటే అది కేవలం మిల్లుదారులు,తనిఖీ చేయని అధికారుల నిర్లక్ష్యమే దీనికి ప్రోత్సాహం” అని విమర్శిస్తున్నాయి.మిల్లులపై రెగ్యులర్ తనిఖీలు, పారదర్శక తూకం వ్యవస్థ, రైతు హక్కులను రక్షించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.



