నేరేడు చర్ల, మార్చి 31, డైనమిక్ న్యూస్
వేసవి కాలంలో పంటల సంరక్షణకు రైతులు సరైన పద్ధతులు అనుసరించాలని వ్యవసాయ శాఖ సూచించింది. నీటి వినియోగం, ఎరువుల వాడకం, చీడపీడల నియంత్రణలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులు సాధ్యమవుతాయని అధికారులు తెలిపారు.
నీటి యాజమాన్యం కీలకం
పంటలకు నీరు ఇవ్వేటప్పుడు సమయపాలన చాలా ముఖ్యమని తెలిపారు. ఉదయం 10 గంటలలోపు లేదా సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే తడులు ఇవ్వాలని సూచించారు. మట్టి పగుళ్లు రాకముందే మళ్లీ నీరు పెట్టడం ద్వారా పంట ఆరోగ్యం కాపాడుకోవచ్చన్నారు. కోతకు వారం నుంచి పది రోజుల ముందు పూర్తిగా నీటిని నిలిపివేయాలని తెలిపారు.
ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు
యూరియా అధికంగా వాడకూడదని స్పష్టం చేశారు. జింక్, బోరాన్, పొటాష్ వంటి ఎరువులను సమతుల్యంగా వినియోగించడం ద్వారా గింజలు గట్టిపడటంతో పాటు పంటలు తెగుళ్లను తట్టుకునే శక్తి పెరుగుతుందని చెప్పారు.
చీడపీడల నియంత్రణపై సూచనలు
సుడి దోమ (BPH) సోకిన పొలాల్లో వెంటనే నీటిని తొలగించి దాని వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. కాండం తొలిచే పురుగులు ముఖ్యంగా చిరుపొట్ట దశలో ఎక్కువగా కనిపిస్తాయని, ఆ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కాళీ బాటలు తీయడం ద్వారా పురుగుల ఉధృతి కొంతవరకు తగ్గించవచ్చన్నారు.
అకాల వర్షాలపై అప్రమత్తం
వేసవిలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు సంభవించే అవకాశాలు ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సందేహాలుంటే అధికారులను సంప్రదించాలి
ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే వెంటనే మండల వ్యవసాయ అధికారి (MAO) లేదా వ్యవసాయ విస్తరణాధికారి (AEO)ను సంప్రదించాలని వ్యవసాయ అధికారి జావేద్ సూచించారు.
