పాలకీడు, డైనమిక్ న్యూస్, నవంబర్ 23
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్‌లో ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీలకు కేటాయించక పోవడం ఆశ్చర్యకరమని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండలంలోని 22 పంచాయతీల్లో ఒక్క బీసీ రిజర్వేషన్ కూడా లేదు
ఆదివారం ప్రకటించిన రిజర్వేషన్లలో పాలకవీడు మండలంలోని మొత్తం 22 గ్రామ పంచాయతీల్లో ఏ ఒక్కటీ బీసీ కేటగిరీకి రాకపోవడం ‘విడ్డూరం మరియు నిర్వాకం’ అని ఆయన వ్యాఖ్యానించారు.“రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు 42% రిజర్వేషన్ కోసం పోరాడుతుంటే, పాలకవీడులో ఒక్క బీసీ పంచాయతీ కూడా లేకపోవడం అన్యాయం” అని అన్నారు.
కలెక్టర్, ఆర్డీఓ తీరు బహుచిత్రం
ఈ రిజర్వేషన్ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ మరియు ఆర్డీఓ వ్యవహరించిన తీరు అత్యంత అనుమానాస్పదంగా ఉందని, ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలోని మరో ఏ మండలంలో కనిపించలేదని ధనుంజయ నాయుడు అన్నారు.“జిల్లా కలెక్టర్ నైతిక బాధ్యత వహించి వెంటనే బదిలీ కోరుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
ఆర్డీఓ రాజీనామా చేయాలని డిమాండ్
స్థానిక ఆర్డీఓ ఎన్నికల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోయారని, ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నందుకు తక్షణమే ఉద్యోగానికి రాజీనామా చేయాలి అని నాయుడు అన్నారు.ఉద్యోగ బాధ్యతలు నిర్వహించలేని వారు ఎన్నికల ప్రక్రియలో కీలక భూమిక పోషించడం విచారం” అని వ్యాఖ్యానించారు.
మంగళవారం భారీ ధర్నా
ఈ నెల మంగళవారం హుజూర్నగర్ ఆర్డీవో కార్యాలయం ముందు జిల్లా వ్యాప్తంగా బీసీ సంస్థలతో కలిసి భారీ ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు ధనుంజయ నాయుడు ప్రకటించారు.
ప్రభుత్వాలు, అధికారులు బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపణ
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బీసీలను అనేక విధాలుగా మోసం చేసిందని, గత ప్రభుత్వాలూ ఇదే ధోరణిని కొనసాగించాయని వ్యాఖ్యానించారు.అధికార వ్యవస్థ కూడా బీసీ వర్గాల్ని నిరంతరం మోసం చేస్తోంది. ఒక్క పంచాయతీ కూడా బీసీలకు రాకపోవడం వెనుక ఉన్న హస్తం ఎవరిదో ప్రభుత్వం ప్రజలకు స్పష్టంచేయాలి” అని అన్నారు.
రావాల్సిన న్యాయం: రిజర్వేషన్లను తిరిగి పునర్విమర్శించాలి
పాలకవీడు మండలంలో రిజర్వేషన్లను తిరిగి పరిశీలించి బీసీలకు కనీస న్యాయం చేయాలని ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు.బీసీ జాతికి క్షమాపణ చెప్పి, బాధ్యతలు నిర్వర్తించలేని అధికారులు స్వయంగా తప్పుకోవాలి” అని స్పష్టం చేశారు.
