Thursday, January 15, 2026
Homeఅమరావతికురగల్లు, మంగళగిరి సోసైటీలో భారీ కుంభకోణం వెలుగులోకి. కురగల్లు పీఏసీఎస్ లో రూ. 7.77కోట్లు, మంగళగిరి...

కురగల్లు, మంగళగిరి సోసైటీలో భారీ కుంభకోణం వెలుగులోకి. కురగల్లు పీఏసీఎస్ లో రూ. 7.77కోట్లు, మంగళగిరి పీఏసీఎస్ లో రూ. 2.46కోట్లు గోల్ మాల్ కీలకసూత్రధారి కురగల్లు సీఈఓ రమేష్ మంత్రి నారాలోకేష్ ఆదేశాలతో కొనసాగుతున్న సమగ్ర దర్యాప్తు సొసైటీల్లో అక్రమాలపై కొనసాగుతున్న విచారణ.

మంగళగిరి , డైనమిక్ న్యూస్, నవంబర్ 24


మంగళగిరిలో ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్ లు) అవినీతి, అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి. రైతులకు చేయూతనివ్వాల్సిన పీఏసీఎస్ లు వారిని దోచుకుంటున్నాయి. ఉన్నతాధికారులు సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. మంగళగిరి మండలం కురగల్లు, మంగళగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో గత రెండు రోజుల క్రితం భారీ అవినీతి వెలుగు చూసిన విషయం విదితమే. పీఏసీఎస్ సీఈఓ రమేష్ రైతులకు నకిలీ ఫిక్సిడ్ డిపాజిట్ బాండ్లను ఇచ్చి మొత్తం షుమారు రూ.10.23కోట్ల ను వసూలు చేసి ఆ డబ్బును బ్యాంకులో జమ చేయలేదు. మంగళగిరి పీఏసీఎస్ కు సైతం ఇన్ ఛార్జి సీఈఓగా అదనపు విధులు నిర్వర్తించిన రమేష్ అదే పీఏసీఎస్ లోనూ 11మంది రైతులకు చెందిన నగదు రూ. 1,16, 65,283లు స్వాహా చేసినట్లు గత నెల తొమ్మిదో తేదీన జీడీసీసీ ఏజీఎం, విచారణ అధికారి సుంకర శ్రీనివాసన్ తన ప్రాథమిక విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అయితే మిగిలిన రైతులకు నోటీసులు అందజేసి ఎవరెవరు ఎంత డిపాజిట్ చేశారనే విషయాన్ని వెల్లడించాల్సిన విచారణ అధికారి శ్రీనివాసన్ మిన్నకుండిపోవడం పై పలువురు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం కూడా 90 మంది రైతులు సుమారు రూ. 1.20 కోట్లు డిపాజిట్ చెల్లించినట్లు చెబుతున్నారు. ఈ కుంభకోణంలో ఖచ్చితంగా జీడీసీసీ ఎంజీఎం శ్రీనివాసన్ తో పాటు మంగళగిరి పీఏసీఎస్ సిబ్బంది శ్రీనివాస్, ఉమా శంకర్ రెడ్డి పాత్ర కూడా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి గత అక్టోబర్ నెల 30వ తేదీన సీఈఓ రమేష్ ను విధుల నుంచి తొలగించారు. అయితే ఈ విషయం రైతులకు తెలియకపోవడంతో నవంబరు నెలలోనూ మరి కొందరు రైతులు ఫిక్సిడ్ డిపాజిట్లు చేసి మోసపోవడం కొసమెరుపు.

సొసైటీల్లో గత ఐదేళ్లుగా జరుగుతున్న మాయాజాలం

కాగా మంగళగిరి, కురగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో గత ఐదేళ్ల కాలంగా ఈ తరహా అవినీతి కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏడాది ఆడిట్ నిర్వహించేందుకు వచ్చే అధికారులను సైతం కురగల్లు సీఈఓ రమేష్ మామూళ్లు ఇచ్చి అన్నీ సక్రమంగా ఉన్నట్లు రిపోర్టు ఇప్పించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మంగళగిరి పీఏసీఎస్ లో రైతుల ఫిక్సిడ్ డిపాజిట్లకు సంబంధించిన నగదును కురగల్లు పీఏసీఎస్ లో ఫిక్సిడ్ డిపాజిట్ లు చేసిన రైతులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తుండటం కొసమెరుపు.

నకిలీ ఫిక్సిడ్ డిపాజిట్ పత్రాలతో రైతులకు బురిడీ

మంగళగిరి, కురగల్లు పీఏసీఎస్ లో నకిలీ ఫిక్సిడ్ డిపాజిట్ పత్రాలతో సీఈఓ రమేష్ రైతులను గత ఐదేళ్లుగా బురిడీ కొట్టిస్తోన్నాడు. కురగల్లులో 114 మంది రైతులకు 104 నకిలీ ఫిక్సిడ్ డిపాజిట్ పత్రాలను ఇచ్చి షుమారు రూ. 7.77 కోట్లు స్వాహా చేయగా మంగళగిరి పీఏసీఎస్ లో 101 మంది రైతులకు నకిలీ డిపాజిట్ పత్రాలు ఇచ్చి షుమారు రూ. 2.46 కోట్లను స్వాహా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు.

విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు

మంగళగిరి, కురగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో జరిగిన సుమారు రూ. 10.23 కోట్ల అవినీతి వ్యవహారంపై సోమవారం జీడీసీసీ అసిస్టెంట్ రిజిస్టార్ ఉమాదేవి నేతృత్వంలో మరో ముగ్గురు అధికారుల బృందం విచారణ చేపట్టారు. నగరంలోని జీడీసీసీ బ్రాంచిలో రికార్డులు తనిఖీ నిర్వహించారు. ఆయా సొసైటీల పరిధిలోని రైతుల డిపాజిట్ పత్రాలను పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. ఎంత మంది రైతులు మోసపోయారు? ఎంత మేరకు నగదు కుంభకోణం జరిగింది? పాత్రధారులు, సూత్రధారులు ఎవరెవరు ? అనేది పూర్తి విచారణలో తేలాల్సి ఉంది.

జీడీసీసీ బ్యాంక్ ఎదుట బాధిత రైతుల ఆందోళన

ఆరుగాలం శ్రమించి కూడబెట్టిన సొమ్మును కురగల్లు, మంగళగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ఫిక్సిడ్ డిపాజిట్లు చేసుకుంటే సీఈఓ రమేష్ తమను నిలువునా మోసగించాడని పలువురు బాధిత రైతులు సోమవారం నగరంలోని ది గుంటూరు డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మంగళగిరి బ్రాంచి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నెలనెలా వడ్డీ చెల్లిస్తుంటే ఇంతకాలం అనుమానం రాలేదని, నకిలీ ఫిక్సిడ్ డిపాజిట్ పత్రాలు ఇచ్చి ఇలా మోసగిస్తాడని కలలో కూడా ఊహించలేదని వాపోయారు. అయితే ఈ కుంభకోణం వెనుక పలువురు అధికారులు, సిబ్బంది కూడా ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ లో తాము ఫిక్సిడ్ చేసిన నగదును ఇప్పించి న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments