Monday, March 2, 2026
Homeతాజా సమాచారంసూర్యాపేట పట్టణంలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం అరైవ్ అలైవ్’ మహా ఉద్యమం భాగంగా...

సూర్యాపేట పట్టణంలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం అరైవ్ అలైవ్’ మహా ఉద్యమం భాగంగా పోలీసుల సామాజిక సేవ

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్ ఫిబ్రవరి 28

రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర పోలీసు శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ మహా ఉద్యమం 2వ విడత కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణంలోని రవి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ కె. నరసింహ ప్రారంభించారు.

దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరం

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 3,500 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.5 లక్షల మంది, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 7,500 మంది రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారని పేర్కొన్నారు.జిల్లాలో 2024లో 278 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా, 2025లో పోలీసు శాఖ తీసుకున్న పటిష్ట చర్యల వల్ల 58 మరణాలను తగ్గించగలిగామని వెల్లడించారు.

డ్రైవర్లకు కంటి చూపు కీలకం

డ్రైవింగ్ వృత్తి కష్టతరమైందని, డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఎస్పీ సూచించారు. కంటి చూపు సరిగా ఉంటేనే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలు స్పష్టంగా గుర్తించి సురక్షితంగా వాహనం నడపగలరని అన్నారు. వయస్సు పెరిగేకొద్దీ కంటి చూపు మందగించే అవకాశం ఉన్నందున తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.లయన్స్ క్లబ్ డాక్టర్లు, గ్లోబల్ కంటి ఆసుపత్రి వైద్యుల సహకారంతో ఈ శిబిరంలో విస్తృతంగా పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశారు.

500 మందికి పైగా డ్రైవర్లు లాభం

ఈ శిబిరంలో వివిధ రకాల వాహనాల డ్రైవర్లు 500 మందికి పైగా పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమాన్ని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవడం పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

రోడ్డు భద్రతపై సూచనలు

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ స్పష్టం చేశారు.

ఎడమ వైపున వాహనం నడపాలి

వేగ పరిమితులు తప్పనిసరిగా పాటించాలి

మద్యం సేవించి వాహనం నడపరాదు

సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరి

డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించరాదు

అలసట, నిద్రలేమి ఉన్నప్పుడు వాహనం నడపవద్దు

వాహన పత్రాలు, బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో పరిశీలించాలి

చిన్న జాగ్రత్త ప్రాణాలను కాపాడగలదని, ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యానికి చేరుకోవాలనే లక్ష్యంతో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

ప్రముఖుల హాజరు

ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు దోసపాటి గోపాల్, కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, పట్టణ సీఐ వెంకటయ్య, సీఐలు రాజశేఖర్, నరసింహారావు, నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు సంపత్, సతీష్ కుమార్, వైద్యులు రంజిత్ కుమార్, స్వాతి, గ్లోబల్ హాస్పిటల్ యాజమాన్యం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments