డైనమిక్,హైదరాబాద్, అక్టోబర్ 28:
తెలుగు రాష్ట్రాలపై మొంథా తుపాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నగరంలో కుండపోత
మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, జర్నలిస్ట్ కాలనీ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్ ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ కొంతసేపు స్తంభించిపోయింది.
తెలంగాణలో వర్ష అలర్ట్
మొంథా తుపాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది.
వాతావరణశాఖ హెచ్చరిక ప్రకారం —
రెడ్ అలర్ట్: ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఆరెంజ్ అలర్ట్: మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట కొమరం భీం, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని సందర్భాల్లో బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించింది.
