డైనమిక్,బాపట్ల జిల్లా, అక్టోబర్ 25
జిల్లా పరిధిలోని బీచ్ లను తాత్కాలికంగా మూసివేస్తున్నామని, యాత్రికులకు/భక్తులకు ప్రవేశం లేదని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మోంతా తుఫానుగా మార్పు చెందే అవకాశం ఉందని, వాతావరణ శాఖ నుండి అందిన సమాచారం మేరకు ఈనెల 27, 28, 29 తేదీలలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలో చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్త ఉత్తర్వుల మేరకు బాపట్ల జిల్లా పరిధిలోని సూర్యలంక, పాండురంగాపురం, వాడరేవు, రామాపురం, కటారి వారి పాలెం, పొట్టి సుబ్బయ్య పాలెం, మోటుపల్లి, పల్లెపాలెం, చిన్నగంజాం, పరిసవారిపాలెం, నక్షత్రానగర్ తదితర బీచ్ లను ది:26.10.2025 తేదీ నుండి మూసి వేయడం జరుగుతుందని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఎవరూ కూడా బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలలోకి రావద్దని జిల్లా ఎస్పీ యాత్రికులు/భక్తులకు సూచించారు.కార్తీక మాసం పురస్కరించుకొని కార్తిక సోమవారాలు పుణ్య స్థానాలు ఆచరించాలని ఉద్దేశంతో సముద్ర తీరాలకు రాదలిచిన భక్తులు ఈ విషయాన్ని గమనించి రావద్దని తెలిపారు.ఎవరైనా పోలీస్ శాఖ హెచ్చరికలను మీరి జిల్లాలోని సముద్ర తీరా ప్రాంతాలలోకి వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లడం నిషేధించడం జరిగిందన్నారు. ఎవరో కూడా వేటకు వెళ్ళవద్దని, ఎవరైనా వెళ్ళి ఉంటే వారు వెంటనే తీరానికి వచ్చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు.మోంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.


