Wednesday, January 14, 2026
Homeతెలంగాణబాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అంతర్జాతీయ బాలిక...

బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అంతర్జాతీయ బాలిక దినోత్సవంలో కలెక్టర్ పిలుపు

డైనమిక్,సూర్యాపేట బ్యూరో

“ఆకాశమే హద్దుగా కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి” అని అబ్దుల్ కలాం చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఆచరణలోకి తీసుకురావాలని విద్యార్థులకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత విభాగం నిర్వహించిన అంతర్జాతీయ బాలిక దినోత్సవం–2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

‘బాలిక చైతన్యం’తో సమాజ మార్పు దిశగా

కలెక్టర్ మాట్లాడుతూ, సూర్యాపేటకు కొత్తగా వచ్చినప్పుడు అబార్షన్ కారణంగా ఒక మహిళ మృతి చెందడం బాధ కలిగించిందని, అలాంటి ఘటనలు జరగకూడదనే సంకల్పంతో ‘బాలిక చైతన్యం’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలలో నెలలో ఒకసారి పోలీస్, ఆరోగ్య, విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖలతో కలిసి విద్యార్థులకు పోషణ, భద్రత, సైబర్ నేరాలు, మహిళా సాధికారత, కెరీర్ గైడెన్స్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

భయపడకండి – ధైర్యంగా ఫిర్యాదు చేయండి

మహిళలు, బాలికలు సోషల్ మీడియా మోసగాళ్లకు భయపడకుండా ధైర్యంగా షీ టీమ్స్ స్టేషన్ లేదా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
“మీ పేర్లు గోప్యంగా ఉంచుతాం, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని కలెక్టర్ హామీ ఇచ్చారు.

విద్య ద్వారానే సమాజ మార్పు

విద్య ద్వారానే ఏది తప్పు, ఏది సరి అనేది తెలిసి సామాజిక, ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
గర్భంలోనే ఆడశిశువులను హతమార్చడం చట్టరీత్యా నేరమని, పీసీపీఎన్‌డీటీ చట్టం ప్రకారం అనధికార స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకున్నామని వివరించారు.

చదువే ఆయుధం – మంచి ఆలోచనలు మంచి భవిష్యత్తు నిర్మిస్తాయి

పాఠశాలల్లో ఆడపిల్లలు చక్కగా రాస్తున్నారని అభినందిస్తూ, విద్యార్థి దశలోనే లక్ష్యాలు నిర్ధారించుకోవాలని కలెక్టర్ సూచించారు.”మంచి ఆలోచనలు మనలో మెలిగితే, అవే మాటలుగా మారి కార్యాచరణగా మారుతాయి. మంచి అలవాట్లే మంచి భవిష్యత్తు నిర్మిస్తాయి” అన్నారు.గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 5,200 మంది అడ్మిషన్లు కాగా, ఈ సంవత్సరం 10,000 మందికి పైగా చేరడం శుభపరిణామమని తెలిపారు.

లింగ వివక్ష నిర్మూలనకు విద్యే సాధనం – అదనపు కలెక్టర్

జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామరావు మాట్లాడుతూ, లింగ వివక్షతను మొగ్గదశలోనే నిర్మూలించాలని పిలుపునిచ్చారు.“ఆకాశంలో, అవకాశాల్లో నేడు మహిళలు సగం భాగం ఉన్నారు — అది విద్య ద్వారానే సాధ్యమైంది” అని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభావం వల్ల మహిళలు సంఘటనలకు భయపడుతున్నారని, పట్టణాల్లో విద్యావృద్ధితో అవగాహన పెరిగిందని చెప్పారు.

విద్యార్థినులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి

విద్యార్థినుల ఆత్మరక్షణ కోసం పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని, ఎవరితో ఎలా ప్రవర్తించాలో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.ఏవైనా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1098 ద్వారా తెలియజేయాలని, ఆ నంబర్ అన్ని పాఠశాలలో ప్రదర్శించాలని సూచించారు.

కళా ప్రదర్శన ఆకట్టుకుంది

కేజీబీవీ చివ్వేంల విద్యార్థినులు రుద్రమదేవి, కలెక్టర్, డాక్టర్, పోలీస్, టీచర్, రైతు వేషధారణలతో ఆకట్టుకునే కళా ప్రదర్శన చేశారు.పోలీసు బృందం పాడిన మహిళా రక్షణ, విద్య గొప్పతనం పై పాటలు ప్రేక్షకులను మెప్పించాయి.

కార్యక్రమంలో పాల్గొన్న వారు

డిడబ్ల్యుఓ నరసింహారావు, సీడబ్ల్యూసీ చైర్మన్ రమణరావు, డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, షీ టీమ్స్ ఎస్‌హెచ్‌ఓ నీలిమ, జీసీడీఓ పూలన్,
మహిళా సాధికారత కోఆర్డినేటర్ చైతన్య, సఖి, భరోసా, బాల సదన్, బాలభవన్ ప్రతినిధులు, రిసోర్స్ పర్సన్లు, రెసిడెన్షియల్, మోడల్ స్కూల్ విద్యార్థినులు, ఉపాధ్యాయినిలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments