డైనమిక్, నరసరావుపేట
పల్నాడు జిల్లాలో నకిలీ మద్యం నిర్మూలనకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌ను ప్రవేశపెట్టినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కే. శ్రీనివాస్ తెలిపారు. నరసరావుపేటలోని డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నకిలీ మద్యం గుర్తించే విధానాలు, యాప్ వినియోగం, ప్రత్యేక టీమ్‌ల ఏర్పాటు వంటి వివరాలను వెల్లడించారు. నకిలీ మద్యం గుర్తించడం ఎలా అంటే… మద్యం సీసాపై సీల్ హోలోగ్రామ్, బార్‌కోడ్ ఉంటాయి. వీటిని స్కాన్ చేస్తే ఎప్పుడు, ఎక్కడ తయారైంది, ఎటు నుంచి వచ్చింది, ఏ దుకాణానికి సరఫరా అయింది వంటి వివరాలు తెలుస్తాయి. నకిలీ మద్యమని తేలితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 14405కు ఫిర్యాదు చేయాలని, 24 గంటల్లోపు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. ‘ఏపీ ఎక్సైజ్ సురక్ష’ యాప్‌ను సెల్‌ఫోన్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత రెండు ఎంపికలు కనిపిస్తాయని, ఒకటి వినియోగదారుల కోసం, మరొకటి మద్యం దుకాణాల నిర్వహణ కోసమన్నారు. వినియోగదారులు బాటిల్‌పైన ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ‘వెరిఫై ప్రోడక్ట్’ ఎంచుకుంటే బ్యాచ్ నంబర్, తయారీ స్థలం, సరఫరా వివరాలు, బ్రాండ్ పేరు, ధర వంటి సమాచారం స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. నకిలీ మద్యమైతే ‘డీటెయిల్స్ నాట్ ఫౌండ్’ అని చూపిస్తుంది. ఈ యాప్ ద్వారా సమాచారం జిల్లా అధికారులు, రాష్ట్రస్థాయి డేటాబేస్‌కు చేరుతుంది. కల్తీ మద్యం నిర్మూలనకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు డిపిఈఓ తెలిపారు. జిల్లాలో ఎక్కడా కల్తీ మద్యం లేదని, బార్లు మరియు వైన్ షాపులను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు వెల్లడించారు. పల్నాడు జిల్లాలో 142 లిక్కర్ షాపులు, 32 బార్లు ఉన్నాయి. ఈ యాప్ ద్వారా నాణ్యమైన మద్యం విక్రయాలకు దోహదపడుతుందని, మద్యం బాటిల్‌పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే విక్రయించాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. జిల్లాలో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించినట్లు తెలిపారు. ఎవరైనా బెల్ట్ షాపులు నడుపుతుంటే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, మద్యం సరఫరా చేసిన షాపు లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. మద్యం దుకాణాల్లో నకిలీ మద్యం ఉందంటూ తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తప్పవని డాక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. అపోహలు, వదంతులు సృష్టించకూడదని, ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌పై అబద్ధాలు ప్రచారం చేసే అవకాశాలు లేవని అన్నారు. ప్రజలు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అసలు మద్యం కొనుగోలు చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
