మునగాల తహసిల్దార్ కార్యాలయంలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
డైనమిక్,సూర్యాపేట బ్యూరో , అక్టోబర్ 16
విధుల్లో నిర్లక్ష్యం, సమయపాలన లోపాలపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. గురువారం ఆయన మునగాల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.తనిఖీ సమయంలో డిప్యూటీ తహసిల్దార్ డి. సత్యనారాయణ, ఎంపీఎస్ ఓ సంపత్, జూనియర్ అసిస్టెంట్ సునీల్ గవాస్కర్, రికార్డ్ అసిస్టెంట్ ప్రశాంత్ లు విధులకు హాజరు కాలేదని గమనించిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయ సమయం ఉదయం 10.30 దాటినా సిబ్బంది హాజరు కానందున, గైర్హాజరైన వారిని వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.అలాగే ఈ నిర్లక్ష్యంపై తహసిల్దార్ సరిత నుండి వివరణ కోరారు. హాజరు రిజిస్టర్ పరిశీలనలో మొత్తం 18 మంది సిబ్బందిలో నలుగురు ఇతర కార్యాలయాల్లో ఉపనియామకంపై పని చేస్తున్నారని, ఇద్దరు సెలవుపై ఉన్నారని, మరొకరు సర్వే పనుల్లో ఉన్నారని వెల్లడైంది. డిప్యూటీ తహసిల్దార్ సహా నలుగురు ఉద్యోగులు గైర్హాజరైనట్లు గుర్తించారు.సిబ్బంది అందరూ సకాలంలో విధులకు హాజరుకావాలని, ఒకవేళ గైర్హాజరైనా లేదా ఆలస్యంగా వచ్చినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.


