నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్ ఫిబ్రవరి 26
డాక్టర్లు తెల్లకోటుకు పరిమితం కాకుండా మానవతా దృక్పథంతో పేదలకు వైద్యసేవలు అందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. గురువారం నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన “అద్వితీ-2026” వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వైద్య వృత్తి పవిత్రమైనది
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి అత్యంత పవిత్రమైందని అన్నారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటైందని, ఇక్కడ చదివే విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు మానవత్వాన్ని కూడా అలవరచుకోవాలని సూచించారు. తెల్లకోటు బాధ్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
విద్యార్థులకు ఏసీ బస్సులు
వైద్య కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం రెండు ఏసీ బస్సులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. నెలలోపే వాటిని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
పరిశోధనకు ఎంఓయూ
ఇటీవల ఏఐజి ఆసుపత్రి డాక్టర్ నాగేశ్వరరెడ్డిని ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకువచ్చినట్లు తెలిపారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివిన పీజీ విద్యార్థులను పరిశోధన నిమిత్తం ప్రతి సంవత్సరం 45 మందిని తన ఆసుపత్రిలోకి తీసుకునేందుకు అంగీకరించారని, ఇందుకు సంబంధించి ఎంఓయూ త్వరలో కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు.
నల్గొండ అభివృద్ధికి కట్టుబాటు
పట్టణంలోని పేద విద్యార్థులకు విద్యలో పూర్తి సహకారం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా బొట్టు గూడా ప్రభుత్వ పాఠశాలలు, ప్రతిక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మరికొన్ని పాఠశాలలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. రూ.900 కోట్లతో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కొనసాగుతోందని, నల్గొండను స్మార్ట్ సిటీగా, మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
ఇతరుల ప్రసంగాలు
నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాలని భావి వైద్యులకు సూచించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ డాక్టర్ వృత్తి పవిత్రమైందని, రోగులను చిరునవ్వుతో పలకరించి సేవలందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అమీర్ ఆశ్రఫ్ అలీ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు.
