డైనమిక్ న్యూస్, జనవరి 29,సూర్యాపేట
ఆహారం మింగలేని అరుదైన వ్యాధి అయిన అకాలేసియా కార్డియాతో బాధపడుతున్న సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన 63 ఏళ్ల మహిళకు మలకపేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ లేకుండానే అత్యాధునిక చికిత్స అందించి విజయవంతంగా కోలుకునేలా చేశారు.
మహిళకు దీర్ఘకాలంగా తీవ్ర సమస్యలు
గత కొంతకాలంగా ఆహారం మింగడంలో తీవ్ర ఇబ్బందులు, ఛాతీలో నొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్న మహిళ యశోద ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రత్యేక ఎండోస్కోపిక్ పరీక్షలు నిర్వహించగా ఆమెకు టైప్–1 అకాలేసియా కార్డియాగా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.
పి.ఒ.ఇ.ఎమ్ విధానంతో విజయవంతమైన చికిత్స
మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్. కిషన్ పర్యవేక్షణలో వైద్య బృందం అత్యాధునిక పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయోటోమీ (POEM) విధానంతో చికిత్స నిర్వహించింది. ఈ విధానం ద్వారా శస్త్రచికిత్స అవసరం లేకుండానే అన్నవాహిక కండరాల ఒత్తిడిని తగ్గించి ఆహారం సజావుగా లోపలికి వెళ్లేలా చేశారు.
చికిత్స అనంతరం స్పష్టమైన మెరుగుదల
చికిత్స పూర్తైన అనంతరం మహిళకు ఆహారం మింగడంలో పూర్తిస్థాయిలో మెరుగుదల కనిపించిందని వైద్యులు తెలిపారు. ఎలాంటి సంక్లిష్టతలు తలెత్తలేదని, రోగి ఆరోగ్యం వేగంగా కోలుకుంటోందని పేర్కొన్నారు.
ఆధునిక సదుపాయాలే విజయానికి కారణం
యశోద ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక ఎండోస్కోపిక్ సదుపాయాలు, అనుభవజ్ఞులైన గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్య బృందం సమగ్ర వైద్య నిర్వహణ వల్లే ఈ క్లిష్టమైన చికిత్స విజయవంతమైందని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్ భాస్కర్ ఇన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ చిదురు శ్రీనివాస్, సీనియర్ మేనేజర్ వాసుకిరణ్ రెడ్డి, ఏజీఎం వినయ్ కుమార్, మేనేజర్ స్వాగత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
