నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 13
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్తంగా చేపట్టిన “Arrive Alive – Road Safety Campaign–2026” కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో ఆర్‌టీసీ, ఆటో డ్రైవర్లకు విస్తృత రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ జి. రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మానవ తప్పిదాలే ప్రమాదాలకు ప్రధాన కారణం
సదస్సులో అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణనష్టం జరగడానికి మానవ తప్పిదాలే కారణమని పేర్కొన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం, సీట్‌బెల్ట్, హెల్మెట్ వాడకపోవడం వంటి కారణాలతో అనేక కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రైవర్లపై పెద్ద బాధ్యత
ఆర్‌టీసీ, ఆటో డ్రైవర్లు ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికుల ప్రాణ భద్రత బాధ్యత మోస్తున్నారని, అందువల్ల వారు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.
రోడ్డు భద్రతపై ముఖ్య సూచనలు
డ్రైవర్లు తప్పనిసరిగా మద్యం సేవించి వాహనం నడపకూడదని, వేగ పరిమితులు, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు సూచిక బోర్డులను గౌరవిస్తూ వాహనాలు నడపాలని తెలిపారు.వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించకూడదని, ప్రయాణికులను సురక్షితంగా ఎక్కించి దించాలని, బ్రేకులు, లైట్లు వంటి వాహనాల సాంకేతిక స్థితిని తరచూ తనిఖీ చేయాలని సూచించారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ప్రమాదాల సమయంలో స్పందనపై అవగాహన
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి, బాధితులకు ప్రాథమిక చికిత్స ఎలా అందించాలి అనే అంశాలపై కూడా డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
ఈ నెల 24 వరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా, గ్రామ స్థాయిలో పాఠశాలలు, కళాశాలలు, డ్రైవర్లు, ప్రజల కోసం అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు, కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీస్ అధికారులు తెలిపారు.
రోడ్డు భద్రత ప్రతిజ్ఞ
సదస్సు ముగింపులో “Arrive Alive” రోడ్డు భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌టీసీ, ఆటో డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రయాణికుల ప్రాణ భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వాణి, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ ఎస్‌ఐ సైదులు, ఆర్‌టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ రాంరెడ్డి, డీఎం వెంకటరమణ, డీటీఆర్బీ రిటైర్ సీఐ అంజయ్యతో పాటు ఆర్‌టీసీ, రవాణా శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో ఆర్‌టీసీ, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
