సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్ 13 జనవరి
రోడ్డు ప్రమాదాల రహిత సూర్యాపేట జిల్లా నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అరైవ్ – ఎలైవ్’ (సురక్షిత గమ్యం – సజీవ ప్రయాణం) కార్యక్రమం కేవలం ఒక్కరోజు కార్యక్రమం కాదని, ఇది ఒక నిరంతర సామాజిక ఉద్యమం అని జిల్లా ఎస్పీ కె. నరసింహ స్పష్టం చేశారు.
కిరాణా ఫ్యాన్సీ మర్చంట్ హాల్‌లో కార్యక్రమ ప్రారంభం
మంగళవారం జిల్లా కేంద్రంలోని కిరాణా ఫ్యాన్సీ మర్చంట్ హాల్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. రోడ్డు భద్రతపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని, ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
గ్రామ గ్రామాన ‘అరైవ్ – ఎలైవ్’ ప్రచారం
ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం, ప్రతి కాలనీ, ప్రతి మండలంలో పోలీసు శాఖ – పౌరుల భాగస్వామ్యంతో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యమం ద్వారా ప్రజలకు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించి ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని అన్నారు.
డిఫెన్సివ్ డ్రైవింగ్‌తో ప్రమాదాల నివారణ
డిఫెన్సివ్ డ్రైవింగ్ విధానాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని ఎస్పీ సూచించారు. రహదారి నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నూటికి నూరు శాతం అరికట్టవచ్చని తెలిపారు. వాహన చోదకుల నిర్లక్ష్యమే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతోందని హెచ్చరించారు.
హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరి
ద్విచక్ర వాహనదారులతో పాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేనిపక్షంలో కఠిన జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీటుబెల్ట్ ధరించాల్సిందేనని అన్నారు.
రాంగ్ రూట్, మద్యం డ్రైవింగ్‌పై కఠిన చర్యలు
రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్ మృత్యువుకు ఆహ్వానం పలకడమేనని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపేవారిపై రాజీలేని కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రహదారి హీరోలకు ‘రహవీర్’ గౌరవం
రహదారి నియమాలు పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచే పౌరులను ‘రహవీర్’ (రహదారి హీరో)గా గుర్తించి గౌరవిస్తామని ఎస్పీ తెలిపారు.
ప్రతిజ్ఞ చేసిన ప్రజలు
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, పౌరులు, అధికారులు రోడ్డు భద్రత పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
హాజరైన అధికారులు
కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, ఇంచార్జ్ ఆర్టీవో జయప్రకాష్ రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఆర్టీసీ డీఎం సునీత, జిల్లా ఆస్పత్రి ఆర్ఎంఓ గీతావాణి, ఆర్ఐఓ ప్రశాంతి, ఎస్‌ఐలు సాయిరాం, ఏడుకొండలు, మహేందర్, ఐలయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
