సూర్యాపేట బ్యూరో, జనవరి 12 (డైనమిక్ న్యూస్):
భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచ నలుమూలల చాటిచెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో వివేకానంద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
“లేవండి… మేల్కొనండి…” నేటి యువతకు మార్గదర్శనం
కలెక్టర్ మాట్లాడుతూ
“లేవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి” అన్న స్వామి వివేకానంద పిలుపు నేటి తరం యువతకు దిక్సూచిలా మారాలని పేర్కొన్నారు. విదేశాల్లోనూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వివేకానంద ధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.తక్కువ వయసులోనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన స్వామి వివేకానంద ఆలోచనలను యువత అనుసరిస్తూ చదువు, క్రీడలు, ఐటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏఐ వంటి రంగాలలో వినూత్నంగా ఆలోచించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
సమాజం కోసం ఆలోచించే వారే నిజమైన యువత
నీది – నాది అన్న భావనకు అతీతంగా సమాజం కోసం ఆలోచించి సమస్యలకు పరిష్కారం చూపే ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద స్ఫూర్తితో నడిచే యువతేనని కలెక్టర్ పేర్కొన్నారు.భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమని, ఆర్థికంగా నాలుగో స్థానానికి ఎదిగిందని గుర్తు చేశారు. నైపుణ్యాలు, సామర్థ్యాలు పెంచుకుంటూ సృజనాత్మక ఆలోచనలతో ముందుకు వెళితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.
యువతే భారతదేశానికి అసలైన సంపద – ఎస్పీ నరసింహ
జిల్లా ఎస్పీ కే. నరసింహ మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. చిన్న వయసులోనే భారతదేశ గౌరవాన్ని విదేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు వివేకానంద అని కొనియాడారు.భారతదేశంలో 60 శాతం కంటే ఎక్కువ మంది యువతేనని, వారిని సక్రమంగా తీర్చిదిద్దితే దేశం ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుతుందని అన్నారు.మత్తు పదార్థాలు, సైబర్ నేరాల వైపు యువత వెళ్లకుండా స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. నేరరహిత సూర్యాపేట నిర్మాణంలో యువత భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.
విజేతలకు బహుమతులు ప్రదానం
వివేకానంద జయంతి సందర్భంగా కళాశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, వ్యక్తిత్వ వికాసం, క్విజ్ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ప్రముఖుల పాల్గొనడం
ఈ కార్యక్రమంలో డీవైఎస్పీ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్లు జుట్టుకొండ సత్యనారాయణ, అన్నపూర్ణ, వివేకానంద ఉత్సవ కమిటీ చైర్మన్ నాగార్జున, కార్యదర్శి ప్రభాకర్, సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
