Wednesday, January 14, 2026
Homeఆంధ్ర ప్రదేశ్మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ– ప్రజలు ఆన్లైన్ సేవలు వినియోగించుకోవాలి : జిల్లా...

మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ– ప్రజలు ఆన్లైన్ సేవలు వినియోగించుకోవాలి : జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్

బాపట్ల, డైనమిక్ న్యూస్, జనవరి 8

చీరాల పట్టణంలో జాతీయ రహదారి NH–216పై ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) కార్యాలయాన్ని గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనూహ్యంగా కలెక్టర్ కార్యాలయానికి రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.

రికార్డులు, సేవలపై సమీక్ష

కార్యాలయంలోని రికార్డుల గదిని పరిశీలించిన కలెక్టర్, రవాణా శాఖ ద్వారా అందిస్తున్న సేవలు ఆన్లైన్ విధానంలో ఎలా అమలవుతున్నాయనే అంశంపై సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.

దరఖాస్తుదారులతో నేరుగా సంభాషణ

ప్రాంగణంలో వేచి ఉన్న దరఖాస్తుదారులను కలెక్టర్ పలకరించి, వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు రవాణా శాఖ ద్వారా అందించాల్సిన సేవలపై పూర్తి సమాచారం అందాలనే ఉద్దేశంతో సూచనలు చేశారు.

నోటీసు బోర్డుల లేమిపై ఆగ్రహం

రవాణా శాఖ సేవలు, నిర్దేశిత ప్రభుత్వ రుసుముల వివరాలు తెలిపే నోటీసు బోర్డులు కార్యాలయంలో లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్‌ను నిలదీశారు. తక్షణమే కార్యాలయం ప్రాంగణంలో సేవల వివరాలు, చెల్లించవలసిన రుసుములతో కూడిన నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయి

తనిఖీల అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్, జిల్లాలో ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరచడమే లక్ష్యంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో పర్యవేక్షణ (సూపర్ విజన్) ఎంతో కీలకమని, రానున్న రోజుల్లో కూడా ఈ తరహా తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

లోపాలపై చర్యలు తప్పవు

ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న కార్యాలయాల పనితీరును గమనించి, లోపాలు గుర్తిస్తే అవసరమైతే సంబంధిత అధికారులపై చర్యలు కూడా తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కూడా తనిఖీ చేయడం జరిగిందని గుర్తు చేశారు.

రవాణా సేవలు పూర్తిగా ఆన్లైన్‌లోకి

రవాణా శాఖ సేవల్లో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ తెలిపారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మాన్యువల్ విధానానికి బదులుగా ఆన్లైన్ సేవలు అమలు చేసే దిశగా జిల్లా స్థాయి రవాణా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

సారధి – వాహన్ పోర్టళ్ల వినియోగం

డ్రైవింగ్ లైసెన్స్ కోసం సారధి పోర్టల్, వాహన రిజిస్ట్రేషన్ కోసం వాహన్ పోర్టల్ ద్వారా ప్రజలు నేరుగా ఆన్లైన్ సేవలు పొందవచ్చని కలెక్టర్ వివరించారు. ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రవాణా సేవలు అందిస్తున్న విషయాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో చీరాల ఆర్డీవో, వేటపాలెం మరియు చీరాల తహసిల్దార్లు, రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ వెంట పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments