Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారంమున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితా అభ్యంతరాలన్నీ పరిష్కరిస్తాం జనవరి 10న తుది ఓటరు జాబితా విడుదల...

మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితా అభ్యంతరాలన్నీ పరిష్కరిస్తాం జనవరి 10న తుది ఓటరు జాబితా విడుదల : జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ బ్యూరో, జనవరి 6, డైనమిక్ న్యూస్

మున్సిపల్ వార్డుల వారీగా ఈ నెల 1న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితాపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

825 అభ్యంతరాలు నమోదు

జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ముసాయిదా ఓటరు జాబితాపై మొత్తం 825 అభ్యంతరాలు అందినట్లు కలెక్టర్ తెలిపారు. ఒక వార్డుకు చెందిన ఓటర్లు మరో వార్డులో నమోదు కావడం, ఒకే కుటుంబ సభ్యులకు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు ఉండటం, ఒక కాలనీ ఓటర్లు రెండు మూడు పోలింగ్ కేంద్రాల్లో ఉండడం వంటి అంశాలపై ఎక్కువగా అభ్యంతరాలు వచ్చినట్లు వివరించారు.

వార్డు వారీగా ప్రత్యేక పరిశీలన

వార్డు వారీగా ప్రచురించిన ఓటరు జాబితాపై ప్రత్యేక దృష్టి సారించి పునఃపరిశీలన చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందిన అభ్యంతరాలన్నింటిని ఈ నెల 9లోపు పరిశీలించి, 10న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని చెప్పారు. అంతలోపు మరిన్ని అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీలు తెలియజేయాలని కోరారు.

అక్టోబర్ 1, 2025 ఆధారంగానే తుది జాబితా

అక్టోబర్ 1, 2025 నాటికి ఓటరు జాబితాలో అప్డేట్ అయిన వివరాలనే పరిగణనలోకి తీసుకుని తుది జాబితా రూపొందిస్తామని స్పష్టం చేశారు. తప్పులులేని ఓటరు జాబితాతో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నామని, ఈ ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.

హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు

అంతకుముందు స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 1న మున్సిపాలిటీలలో ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించామని తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ కోసం మున్సిపాలిటీలలో హెల్ప్ డెస్క్‌లు, కంప్యూటర్ సిస్టమ్‌లు ఏర్పాటు చేసి అభ్యంతరాలు స్వీకరించినట్లు వెల్లడించారు.

రాజకీయ పార్టీల సూచనలు

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ, తుది ఓటరు జాబితా ప్రకటించే ముందే వార్డు హద్దులను ఖరారు చేయాలని, కొత్త ఇంటి నంబర్ల విషయంలో ఓటరు జాబితాలో టాలీ కావడం లేదని తెలిపారు.
ఒకే ఇంట్లో ఓట్లు వేర్వేరు వార్డులకు వెళ్లడం, డబుల్ ఓట్లు, మృతుల ఓట్లు తొలగించాలని కోరారు. అద్దె ఇళ్లలో నివసించే వారికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని సూచించారు.

అవసరమైన చోట అదనపు పోలింగ్ కేంద్రాలు

కలెక్టర్ స్పందిస్తూ, ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 800 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నచోట అదే లొకాలిటీలో మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీఎల్ఓల ద్వారా ఫామ్ 7, 8 ఆధారంగా ఓటర్ల అప్డేషన్ జరుగుతుందని పేర్కొన్నారు.

సమావేశంలో పాల్గొన్నవారు

ఈ సమావేశంలో కాంగ్రెస్ నుంచి నర్సింహారావు, బీఆర్‌ఎస్ నుంచి పిచ్చయ్య, బీజేపీ నుంచి లింగస్వామి, ఎంఐఎం నుంచి మహమ్మద్ రజియుద్దిన్, టీడీపీ నుంచి రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు.
సీపీఎం నుంచి నర్సిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments