నల్గొండ బ్యూరో, జనవరి 6, డైనమిక్ న్యూస్
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా తీసుకున్న నిర్ణయం మేరకు రేపటి నుంచి (బుధవారం) నల్గొండ జిల్లా వ్యాప్తంగా ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, తెలిపారు.
అన్ని పెట్రోల్ బంకులకు స్పష్టమైన ఆదేశాలు
జిల్లా పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ధరించకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేయరాదని ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ నిబంధన అమలుపై ఇప్పటికే పెట్రోల్ బంక్ నిర్వాహకులు, సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చామని పేర్కొన్నారు.
హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన
ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించామని, ప్రజలను చైతన్యపరుస్తున్నామని ఎస్పీ వివరించారు.
రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులే ఎక్కువ
రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులే అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల తల గాయాలు తీవ్రంగా మారి ప్రాణనష్టం సంభవిస్తున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రాణ రక్షణే లక్ష్యం
రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడడమే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
హెల్మెట్ తప్పనిసరి – పోలీసుల విజ్ఞప్తి
ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన భద్రతతో పాటు కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.
ప్రజల సహకారంతోనే రోడ్డు భద్రత
ప్రజల సహకారం ఉంటేనే రోడ్డు భద్రత సాధ్యమవుతుందని, చట్టాలను గౌరవించి నిబంధనలు పాటించడం ద్వారా తమ ప్రాణాలను తాము కాపాడుకోవాలని జిల్లా పోలీస్ శాఖ కోరింది.
