డైనమిక్ న్యూస్,గుంటూరు, డిసెంబర్ 23
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ మరియు నార్వేకు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ నార్వేస్ నెట్‌వర్క్స్ ఏఎస్ మధ్య పరిశోధన, ఆవిష్కరణల రంగంలో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఈ విషయాన్ని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నార్వేస్ నెట్‌వర్క్స్ ఏఎస్ సీఈఓ బహార్గుల్ ఎమిన్‌కు ఎంవోయూ పత్రాలను అందజేశారు.
ఈ ఒప్పందం ద్వారా విజ్ఞాన్స్ యూనివర్సిటీ క్యాంపస్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. 5జీ, 6జీ, నాన్–టెరెస్ట్రియల్ నెట్‌వర్క్స్, ప్రైవేట్ నెట్‌వర్క్స్, ఏఐ ఆధారిత కోర్ నెట్‌వర్క్స్, ఎడ్జ్ కంప్యూటింగ్, క్లౌడ్ టెక్నాలజీలపై ఆధునిక పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు, అధ్యాపకులు సాంకేతిక పరిష్కారాలు రూపొందించే అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
వడ్లమూడి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ‘వడ్లమూడి 5జీ విలేజ్’ వంటి ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే 5జీ స్టాండఅలోన్ సిస్టమ్స్, నెట్‌వర్క్ స్లైసింగ్, ఆటోమేషన్, ఏఐ–నేటివ్ 6జీ కోర్, స్మార్ట్ క్యాంపస్, ఆరోగ్యం, విద్య, తయారీ, రక్షణ, ఆక్వాకల్చర్ రంగాలకు ఉపయోగపడే పరిశోధనలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
విద్యార్థుల ఆధ్వర్యంలో రూపొందే ప్రాజెక్టులకు వాణిజ్య అవకాశాలు, సంయుక్త పేటెంట్లు, పరిశోధన పత్రాలు, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. డీఎస్టీ, సేర్బ్, మైటీ, డీఓటీ, ఏఐసీటీఈ, ఇస్రోతో పాటు యూరోపియన్ యూనియన్ (హారిజన్ యూరప్) వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థల నిధుల కోసం సంయుక్తంగా పరిశోధనా ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు తెలిపారు.
నార్వేస్ నెట్‌వర్క్స్ సంస్థ అత్యాధునిక ప్రైవేట్ 5జీ టెస్ట్‌బెడ్, 6జీ సంబంధిత నెట్‌వర్క్ సాంకేతికతలను అందించనుండగా, విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రయోగశాలలు, మౌలిక వసతులు, పరిశోధనా వాతావరణంతో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను బలోపేతం చేయనుంది. ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉండనుండగా, పరస్పర అంగీకారంతో పొడిగించే అవకాశం ఉందని తెలిపారు.ఈ భాగస్వామ్యం ద్వారా విజ్ఞాన్స్ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమ–ఆధారిత పరిశోధనలకు కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో వివిధ విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
