సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 14
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ గూండాల దాడిలో దారుణంగా హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం పరామర్శించారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఓటమి భయంతోనే కాంగ్రెస్ దాడులు: కేటీఆర్
అనంతరం నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… కేవలం సర్పంచ్, పంచాయతీ ఎన్నికలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని విమర్శించారు. రెండేళ్ల పాలనలో అద్భుతాలు చేశామని కాంగ్రెస్ చెబుతున్న మాటలు నిజమైతే ఎన్నికలంటే ఎందుకు భయమని ప్రశ్నించారు. ఇచ్చిన 420 హామీలు అమలు చేసి ఉంటే ప్రజలే బ్రహ్మరథం పట్టేవారని, వైఫల్యాల భయంతోనే కాంగ్రెస్ నేతలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
మేము తిరగబడితే తట్టుకోలేరు – హెచ్చరించిన కేటీఆర్
పదేళ్లు అధికారంలో ఉన్నా ఎప్పుడూ ఇలాంటి రాజకీయాలు చేయలేదని కేటీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు కొనసాగితే తాము కూడా తిరగబడక తప్పదని హెచ్చరించారు. అలా జరిగితే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణకు హింసాత్మక రాజకీయాలు కొత్తవని, కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు.
మల్లయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం హామీ
మల్లయ్య మృతి చెందిన వెంటనే రావాలనుకున్నా, ఉద్రిక్తతలు పెరగకూడదనే ఉద్దేశంతో ఆగినట్లు కేటీఆర్ తెలిపారు. మల్లయ్య కుటుంబానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
50 శాతం స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ శ్రేణులకు అభినందనలు
కాంగ్రెస్ కవ్వింపు చర్యల మధ్య కూడా ధైర్యంగా పోరాడి పంచాయతీ ఎన్నికల్లో సుమారు 50 శాతం సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రజలంతా కేసీఆర్ పాలన కోసం, ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నారని అన్నారు.
భారీగా పాల్గొన్న నేతలు
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లయ్య యాదవ్, బూడిద బిక్షమయ్యతో పాటు భూపాల్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, నరసింహ రెడ్డి, గుజ్జ యుగంధర్ రావు, దయాకర్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
