Tuesday, March 3, 2026
Homeతాజా సమాచారంపారదర్శకంగా రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి– జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా...

పారదర్శకంగా రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి– జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి

నల్గొండ బ్యూరో , డైనమిక్ న్యూస్,13 డిసెంబర్

రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.

ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన

మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో ఆదివారం జరగనున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శనివారం మాడుగులపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ (డిస్ట్రిబ్యూషన్–రిసెప్షన్) కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలించి, స్టేజ్–2 అధికారులతో మాట్లాడారు.

పోలింగ్, కౌంటింగ్‌లో నిర్లక్ష్యానికి తావులేదు

గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపును కూడా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి వివాదాలకు, నిర్లక్ష్యానికి తావివ్వకుండా పోలింగ్, కౌంటింగ్ అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు.

బ్యాలెట్ పత్రాల భద్రత స్టేజ్–2 ఆర్వోల బాధ్యత

పోలైన బ్యాలెట్ పత్రాల భద్రత, సంరక్షణ పూర్తి బాధ్యత స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులదేనని తెలిపారు. కౌంటింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ పత్రాలను భద్రపరచి, మరుసటి రోజు సమీపంలోని ఎస్టీవోలో జమ చేసే వరకు ఆర్వోలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

రీకౌంటింగ్, ఫలితాల వెల్లడిపై స్పష్టమైన ఆదేశాలు

కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రీకౌంటింగ్ ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయానికే కౌంటింగ్ ప్రారంభించాలని, ఫలితాల వెల్లడిలో ఎలాంటి జాప్యం చేయవద్దని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు, పటిష్ట భద్రత

ఆదివారం ఎన్నికలు జరగనున్న 10 మండలాల్లోని సుమారు 250 పోలింగ్ కేంద్రాల లొకేషన్లలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెబ్‌కాస్టింగ్‌తో పాటు మైక్రో అబ్జర్వర్లను నియమించామని, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

సుమారు 5000 మంది సిబ్బంది వినియోగం

రెండవ విడత పోలింగ్ కోసం సుమారు 5000 మంది సిబ్బంది సేవలను వినియోగిస్తున్నామని తెలిపారు. దూర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలకు ముందుగానే ఎన్నికల సామాగ్రిని తరలించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. దామరచర్ల, నెరేడుగొమ్ము వంటి పెద్ద మండలాల్లోని ప్రధాన గ్రామపంచాయతీలకు జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షణకు నియమించినట్లు వెల్లడించారు.

డిసెంబర్ 14న రెండవ విడత పోలింగ్

ఈ నెల 14న మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని అడవిదేవులపల్లి, అనుముల, దామరచర్ల, మాడుగులపల్లి, మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం, వేములపల్లి మండలాల్లోని 2418 పోలింగ్ కేంద్రాల పరిధిలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు గాను 2898 మంది పోలింగ్ అధికారులు, 3334 మంది ఓపిఓలను నియమించినట్లు తెలిపారు.

అధికారుల హాజరు

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు, తహసిల్దార్, ఎంపీడీవోలు తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments