Thursday, January 15, 2026
Homeఆంధ్ర ప్రదేశ్చేనేత కార్మికులను ఆదుకోవాలికూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలని వినతిపత్రం

చేనేత కార్మికులను ఆదుకోవాలికూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలని వినతిపత్రం

డైనమిక్ న్యూస్, సోమందేపల్లి , డిసెంబర్ 8

చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం సోమందేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసిల్దార్ రెడ్డి శేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.

200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అమలు చేయాలి

ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శి జింక నాగరాజ్, సీపీఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కొండా వెంకటేశులు మాట్లాడుతూ—
ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అలాగే ‘నేతన్న నేస్తం’ పథకం కింద సంవత్సరానికి రూ.25,000 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.

రెండేళ్లయినా హామీలు అమలు కాలేదు

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటివరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు గానీ, నేతన్న నేస్తం పథకం గానీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేవలం 100 యూనిట్ల వరకు మాత్రమే ఉచిత విద్యుత్తు అందుతోందని తెలిపారు.

మూడు సెంట్ల స్థలం, షెడ్డు, ముద్ర రుణాలు ఇవ్వాలి

ప్రతి చేనేత కుటుంబానికి మూడు సెంట్ల ఇంటి స్థలం, షెడ్డు నిర్మాణం, అలాగే నిబంధనలు లేకుండా ముద్ర రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వందలాది పేద కుటుంబాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

ఆర్థిక చేయూత లేక నిర్వీర్యం అవుతున్న చేనేత రంగం

ఆటో డ్రైవర్లు, తోపుడు బండ్ల వ్యాపారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నప్పటికీ, చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన ‘నేతన్న నేస్తం’ గురించి మాత్రం ప్రభుత్వం నోరు మెదపడం లేదని విమర్శించారు. ఆర్థికంగా ఆదుకోకపోవడంతో చేనేత రంగం నిర్వీర్యమవుతోందని ఆరోపించారు.

ఆధార్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆదేశం

వినతిపత్రం స్వీకరించిన డిప్యూటీ తహసిల్దార్ రెడ్డి శేఖర్ స్పందిస్తూ—చేనేత కార్మికులు తమ ఆధార్, గుర్తింపు కార్డులు రెండు రోజుల్లో అందించాలని, తద్వారా జిల్లా ఉన్నతాధికారులకు నివేదించగలమని తెలిపారు.

నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ సమస్యలపై ప్రభుత్వానికి గళం విప్పారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments