హైదరాబాద్, నవంబర్ 21, డైనమిక్ న్యూస్
తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆమె రాజ్‌భవన్‌కు వెళ్లి మధ్యాహ్న భోజనం అనంతరం విశ్రాంతి తీసుకుంటారు.
రాష్ట్రపతి నిలయంలో కళా మహోత్సవ ప్రారంభం
రాజ్‌భవన్ నుంచి సాయంత్రం 3:50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి ముర్ము చేరుకుంటారు. సాయంత్రం 4.00 గంటలకు అక్కడ నిర్వహించే భారతీయ కళా మహోత్సవంను ఆమె ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం 6:15 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు.
రాజ్‌భవన్‌లో రాత్రి బస
రాష్ట్రపతి ముర్ము ఈ రాత్రి తెలంగాణ రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు. శనివారం ఉదయం 9:30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి బయలుదేరుతారు. శతజయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొననున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలోని ముఖ్య రూట్లపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
