నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 19
ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 12 నుండి 19 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వారోత్సవ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు బుదవారం సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రెవెన్యూ అధికారి వై. అశోక్ రెడ్డి మాట్లాడుతూ,
“వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఆసరా పెన్షన్‌తో పాటు మెరుగైన జీవన విధానం కోసం అవసరమైన సౌకర్యాలను అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి” అని తెలిపారు.
వృద్ధుల కోసం ఉచిత ఆశ్రమం – త్వరలోనే దిన సంరక్షణ కేంద్రం
వయోవృద్ధుల కోసం ఉచిత ఆశ్రమం నిర్మాణానికి స్థల కేటాయింపు జరిగిందని ఆయన వివరించారు.అలాగే, “తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే. వృద్ధులపై జరిగే అన్యాయాలను ఎదుర్కొనేందుకు రెవెన్యూ, పోలీసు శాఖలు ప్రత్యేక శ్రద్ధతో కేసుల పరిష్కారానికి పనిచేస్తున్నాయి” అని చెప్పారు.
వృద్ధుల కోసం ప్రత్యేక దిన సంరక్షణ కేంద్రం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
కుటుంబ ప్రేమే వృద్ధుల బలం : జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి
ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి కె.వి. కృష్ణవేణి మాట్లాడుతూ,“కుటుంబ సభ్యుల ప్రేమ, అభిమానం ఉన్నప్పుడు వృద్ధులకు అది మరో బాల్యంలాంటిదే” అని పేర్కొన్నారు.జిల్లాలో వృద్ధుల కోసం నిర్వహిస్తున్న టోల్ ఫోన్ సేవ ద్వారా అందిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
విశిష్ట సేవలు అందించిన వృద్ధులకు సన్మానం
కార్యక్రమంలో వయోవృద్ధులకు విశేష సేవలు అందించిన వారిని సన్మానించారు.సీనియర్ పౌరుల సంఘం జిల్లా అధ్యక్షులు సముద్రాల మల్లికార్జున్, కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, అదనపు వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి, మహిళా – శిశు – వికలాంగుల – వయోవృద్ధుల శాఖ ఫీల్డ్ ప్రతిస్పందన అధికారి మునగాల నాగిరెడ్డి, కార్యాలయ సిబ్బంది వెంకట్ రెడ్డి, బాలయ్య, సునీత తదితరులు పాల్గొన్నారు.
