రంగారెడ్డి జిల్లా, డైనమిక్ న్యూస్, నవంబర్ 18
షాద్‌నగర్‌లో దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్‌పై అగ్రవర్ణస్తులు చేసిన కుల దురహంకార హత్యపై ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం తీవ్ర ఆందోళనకరమని షాద్‌నగర్ న్యాయవాది, యువ నాయకుడు దానక్క సంగమేశ్వర్ మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 24 గంటల్లోగా స్పందించాల్సిందే అని డిమాండ్ చేశారు.
రాజశేఖర్ హత్యపై ప్రభుత్వ మౌనం విచారం కలిగిస్తోంది
ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్‌ను దారుణంగా హత్య చేసి శవాన్ని దహనం చేసిన ఘటనపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆశ్చర్యకరమని సంగమేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు కూడా నోరు విప్పకపోవడం దళితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
“దళితులపై చూపు వేయాలంటేనే దడ పుట్టేలా చేస్తాం” — హెచ్చరిక
దళితులపై జరుగు దాడులను అరికట్టేందుకు అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని సంగమేశ్వర్ హెచ్చరించారు.
అన్యాయం జరిగి ఎన్నో రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించకపోవడం దళితుల పట్ల చిన్నచూపుకు నిదర్శనమని అన్నారు.
పోలీసుల నిర్లక్ష్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి
రాజశేఖర్ హత్య కేసులో కొందరు పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ, వారిపై తక్షణంగా శాసనపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చర్యలు జరిగే వరకు పోరాటం నిలిపేది లేదని స్పష్టం చేశారు.
రేపు దళిత సంఘాలతో భారీ మీడియా సమావేశం
ముఖ్యమంత్రి స్పందన రాకపోతే రేపటి నుంచే ఉద్యమ కార్యాచరణను ప్రారంభించనున్నామని, ఇందుకు సంబంధించి దళిత సంఘాలు, ప్రజా మేధావులతో కలిసి భారీ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దళిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని సంగమేశ్వర్ హెచ్చరించారు.
