హైదరాబాద్, అమరావతి, డైనమిక్ డెస్క్, నవంబర్ 16
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా రాష్ట్రంలో అమీబిక్ మెనింజోఎన్సైఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) కేసులు నమోదవుతుండటంతో భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఈ సూచనలు విడుదల చేశారు.
నదీస్నానాలప్పుడు అప్రమత్తంగా ఉండాలి
పొంగు నీటిలో నదీస్నానం చేస్తూ ముక్కులోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలని అధికారులు సలహా ఇచ్చారు. అమీబా ఇన్‌ఫెక్షన్ ప్రధానంగా ముక్కు ద్వారా మెదడులోకి వెళ్లే అవకాశం ఉండటంతో భక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తాగునీరు, పరిశుభ్రతపై హెచ్చరిక
భక్తులు తప్పనిసరిగా వేడి చేసిన నీటినే తాగాలని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడగడం, పరిశుభ్రత పాటించడం ద్వారా ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొంది.
అత్యవసర సేవలకు హెల్ప్‌లైన్
శబరిమల యాత్రికులకు అత్యవసర సహాయం కోసం 04735-203232 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఆరోగ్య శాఖ అందుబాటులో ఉంచింది. భక్తులు ఏదైనా అసౌకర్యం కలిగిన వెంటనే ఈ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
