Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంపేదవారి సొంటింటి కల నెరవేర్చాలి – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సింగిల్ బెడ్‌రూమ్...

పేదవారి సొంటింటి కల నెరవేర్చాలి – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు

సూర్యాపేట బ్యూరో, డైనమిక్, నవంబర్ 13

పేదలకు గృహ సదుపాయం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రామస్వామిగుట్ట వద్ద జరుగుతున్న సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను గురువారం ఆయన స్వయంగా పర్యవేక్షించారు.

ఇందిరమ్మ కాలనీలో నిర్మాణ పనులు పరిశీలన

కలెక్టర్ ఇందిరమ్మ కాలనీని సందర్శించి గృహాలు, రోడ్లు, నీటి సంపులు, సెప్టిక్ ట్యాంకులు, విద్యుత్‌ సరఫరా వంటి పనులను పరిశీలించారు. నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఏటీసీ సెంటర్‌లో విద్యార్థులతో కలెక్టర్

తదుపరి అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్ (ATC)‌ను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు.“ఏటీసీ ద్వారా మీరు నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుని ఉపాధి పొందాలి, జీవితంలో స్థిరపడాలి,”అని కలెక్టర్ విద్యార్థులను ప్రోత్సహించారు.

వేపలసింగారం ధాన్యం కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ

వేపలసింగారం పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీరియల్ రిజిస్టర్ పరిశీలించి ఇప్పటి వరకు 14 మంది రైతులు ధాన్యం తీసుకువచ్చినట్టు సమాచారం అందించారు.తేమ శాతం 17కు చేరగానే ధాన్యం శుభ్రపరిచి మిల్లులకు తరలిస్తున్నామని నిర్వాహకులు వివరించారు.

జిల్లాలో 338 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

హుజూర్నగర్ ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ—“జిల్లాలో మొత్తం 338 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. రైతులు ప్రభుత్వ కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకువస్తే, మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ కూడా లభిస్తుంది. ట్యాబు ఎంట్రీ అనంతరం 48 గంటల్లో రైతుల ఖాతాలోనే డబ్బులు జమ అయ్యేలా చూస్తున్నాం అన్నారు.

రామస్వామిగుట్టలో 2,160 ఇళ్ల నిర్మాణం పురోగతిలోనే

హుజూర్నగర్ పట్టణంలో రామస్వామిగుట్ట వద్ద మొత్తం 2,160 ఇళ్లను మంజూరు చేసినట్లు కలెక్టర్ వివరించారు.ప్రతి బ్లాక్‌లో 16 ఇళ్లు చొప్పున 135 బ్లాక్‌లలో నిర్మాణం కొనసాగుతోందని, అందులో 124 బ్లాక్‌లలో 1,984 ఇళ్లు పూర్తయ్యాయని, మిగిలిన 11 బ్లాక్‌లలో 176 ఇళ్లకు స్లాబ్ పూర్తి అయ్యి గోడల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సెప్టిక్ ట్యాంకులు, రెండు నీటి సంపులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు కూడా పురోగతిలో ఉన్నాయని చెప్పారు.

ఇతర అభివృద్ధి పనుల సమీక్ష

డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, ఆర్ & బి అతిథి గృహం నిర్మాణాల పురోగతిపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించామని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో భూ భారతి దరఖాస్తులను నిరంతరం పరిష్కరిస్తున్నామని, భూ భారతి మరియు ధాన్యం కొనుగోలు పై ప్రతిరోజూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

కలెక్టర్ వెంట ఉన్న అధికారులు

ఆర్డీఓ శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ సిధార్థ, ఎంపీడీఓ సుమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డీఈ జంగయ్య, డీటీ నాగేందర్, ఏఈ సాయిరాం రెడ్డి, వర్క్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్లా, పీఎసీఎస్ సీఈఓ వీరబాబు, సెంటర్ ఇన్‌చార్జ్ హరీష్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments