నల్గొండ బ్యూరో, నవంబర్ 12 , డైనమిక్
ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు. తుఫాన్ కారణంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ, ఇప్పుడు కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రైతులు తొందరపడి ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
చర్లపల్లి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి
బుధవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని చర్లపల్లి వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు.ధాన్యం తేమశాతం, నిల్వ విధానం, రైతులు తెచ్చిన ధాన్యం వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా రైతులతో, హమాలీలతో, కేంద్ర నిర్వాహకులతో మంత్రి ముఖాముఖిగా మాట్లాడారు.
రోజుకు 10,000 మెట్రిక్ టన్నులకుపైగా కొనుగోలు
వాతావరణ సమస్యల కారణంగా కొనుగోళ్లు ఆలస్యమైనప్పటికీ, ఇప్పుడు ప్రతిరోజు 10,000 మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు జరుగుతోందని మంత్రి తెలిపారు.ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్‌తో సమీక్ష జరిపి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పారు.“రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలి. మద్దతు ధరతో పాటు బోనస్ లభిస్తుంది
రాత్రింబగళ్లు పనిచేయాలని అధికారులకు ఆదేశాలు
కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం జరగకుండా రాత్రింబగళ్లు పనిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.
కాలువలు పూర్తి అయితే సాగునీరు, భూగర్భ జలాలకు లాభం
నల్గొండ నియోజకవర్గంలో బ్రాహ్మణ వెల్లేముల కాలువతో పాటు చర్లపల్లి, మర్రిగూడెం, అన్నేపర్తి, కంచనపల్లి చెరువులు నింపే ప్రణాళిక ఉందని తెలిపారు.దీని ద్వారా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు సాగునీరు అందుతుందని అన్నారు.ఇందుకోసం భూసేకరణకు ₹17 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు మళ్లీ ప్రారంభం
తన హయాంలో ప్రారంభమైన ఎస్ఎల్బిసి టన్నెల్ దురదృష్టకర సంఘటనతో ఆగిపోయిందని, అయితే ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాలతో మాగ్నెటిక్ సర్వే ప్రారంభమైందని తెలిపారు.రెండు సంవత్సరాల్లో టన్నెల్ పూర్తి అయితే నల్గొండలో ప్రతి సంవత్సరం రెండు పంటలకు సాగునీరు లభిస్తుందని, ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి వివరించారు.
మంత్రి వెంట ఉన్న అధికారులు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, డీఎస్ఓ వెంకటేష్, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
