హుజూర్‌నగర్, నవంబర్ 9 (డైనమిక్ )
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం లింగగిరి గ్రామానికి చెందిన ముజాహిద్దీన్ అనే యువకుడు ఆదివారం పులిచింతల ప్రాజెక్టులో గల్లంతైన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.
స్నేహితులతో కలిసి విహారయాత్ర
సెలవు రోజు కావడంతో ముజాహిద్దీన్ తన స్నేహితులతో కలిసి పులిచింతల ప్రాజెక్టుకు వెళ్లాడు. ప్రాజెక్టు ప్రాంతంలో సరదాగా గడుపుతూ ఉండగా ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి గల్లంతైనట్టు ప్రాథమిక సమాచారం.
ఫైర్ సిబ్బంది శ్రమ
సాయంత్రం మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న కోదాడ ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని గల్లంతైన ముజాహిద్దీన్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. రాత్రి వరకు కూడా శోధన కొనసాగుతున్నట్లు తెలిసింది.
స్థానికుల్లో ఆందోళన
ఈ సంఘటనతో లింగగిరి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
