నల్లగొండ బ్యూరో, డైనమిక్,నవంబర్9
నల్లగొండ జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నాడు న్యాయ సేవల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గౌరవ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ (NALSA), రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ (TSLSA) ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
ప్రజలకు ఉచిత న్యాయ సహాయం – అవగాహనపై దృష్టి
జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి పురుషోత్తం రావు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం సంస్థ ప్రధాన ధ్యేయమని అన్నారు. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు చట్టాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
లోక్ అదాలత్‌ల ద్వారా తగాదాల పరిష్కారం
లోక్ అదాలత్‌ల నిర్వహణ ద్వారా కుటుంబ వివాదాలు, సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ వాహన ప్రమాదాలు, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ కేసులు మొదలైనవి వేగవంతంగా పరిష్కరించవచ్చని పురుషోత్తం రావు తెలిపారు. ఈ నెల 15వ తేదీన జరగబోయే ప్రత్యేక లోక్ అదాలత్‌లో ప్రజలు తమ కేసులను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
పారా లీగల్ వాలంటీర్లకు పిలుపు
పారా లీగల్ వాలంటీర్లు ప్రజలకు న్యాయ సహాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ న్యాయ సేవా సంస్థ మరియు ప్రజల మధ్య వారధిగా నిలవాలని పురుషోత్తం రావు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంత రెడ్డి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఎన్. భీమార్జున్ రెడ్డి, నామినేటెడ్ మెంబర్ కట్ట వెంకట్ రెడ్డి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఎం. లెనిన్ బాబు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
