డైనమిక్ ,మునుగోడు, నవంబర్ 2
మానవతా విలువలకు ప్రతిరూపంగా నిలిచారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కిడ్నీ సమస్యతో జీవితమంతా చీకటిలో మునిగిపోయిన పేద కుటుంబానికి ఆశాకిరణంగా మారి యువకుడికి కొత్త ప్రాణం పోశారు.నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామానికి చెందిన నెల్లి గణేష్ (26) కిడ్నీలు పనిచేయకపోవడంతో గత కొద్ది నెలలుగా తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. డాక్టర్లు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స (Kidney Transplantation) తప్ప గణేష్ ప్రాణాలు నిలవవని తేల్చారు. అయితే కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో చికిత్సకు కావాల్సిన భారీ వ్యయం భరించలేక తీవ్ర ఆందోళనలో వున్నారు.ఈ విషయం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. ఆయన స్వంతంగా ₹12.50 లక్షలు ఖర్చుచేసి కామినేని ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్సకు సహాయం చేశారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా చేయించి, యువకుడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా చూసుకున్నారు.చికిత్స విజయవంతంగా పూర్తయిన అనంతరం రాజగోపాల్ రెడ్డి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి గణేష్ బాగోగులు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పి, “మీకు నేను ఉన్నాను, గణేష్ త్వరగా కోలుకుంటాడు” అని భరోసా ఇచ్చారు.తన కుమారుడి ప్రాణాలు కాపాడినందుకు గణేష్ తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. “మా బిడ్డకు పునర్జన్మ ఇచ్చారు, జీవితాంతం రుణపడి ఉంటాం” అని భావోద్వేగంగా తెలిపారు.మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క ఈ మానవతా సేవను ప్రశంసలతో కొనియాడుతున్నారు. ఒక మనిషి ప్రాణం కాపాడటమే కాదు, ప్రజాసేవలో ఆయన ఉన్నతమైన విలువలు మరోసారి ప్రతిఫలించాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.“సేవే నిజమైన రాజకీయ ధర్మం” అని నిరూపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజల హృదయాల్లో మరోసారి స్థానం సంపాదించారు.

