డైనమిక్ డెస్క్ , హైదారాబాద్,అక్టోబర్ 31
భారత చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు దేశ ఐక్యత, దృఢ సంకల్పం, అచంచల నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. 1875 అక్టోబర్ 31న గుజరాత్ రాష్ట్రంలోని నాడియాద్ గ్రామంలో జన్మించిన పటేల్, న్యాయవృత్తిని చేపట్టినా, స్వాతంత్య్ర పోరాటాన్ని తన జీవిత ధ్యేయంగా మలచుకున్నారు. మహాత్మా గాంధీ ఆలోచనల ప్రభావంతో స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
అంబేద్కర్‌కు పటేల్ అపార మద్దతు
భారత రాజ్యాంగ రచనలో సర్దార్ పటేల్ పాత్ర అత్యంత కీలకమైనది. రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా అంబేద్కర్‌ను డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్‌గా పనిచేసిన ఆయన, రాజ్యాంగ రూపకల్పనకు విలువైన మార్గదర్శకత్వం అందించారు.
562 సంస్థానాల విలీనం సాధించిన నాయకుడు
స్వాతంత్య్రానంతరం దేశ ఏకీకరణ బాధ్యతను తన భుజాలపై వేసుకున్న సర్దార్ పటేల్, భారతదేశ తొలి హోం మంత్రి, ఉప ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఆయన కృషి ఫలితంగా దాదాపు 560కి పైగా స్వయంపాలిత సంస్థానాలు భారత సమాఖ్యలో విలీనమయ్యాయి. పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో విభజన శరణార్థులకు సహాయం చేసి, శాంతి పునరుద్ధరణలో కూడా విశేషంగా కృషి చేశారు.
హైదరాబాద్ విలీనంలో కీలక పాత్ర
1947లో స్వాతంత్య్రం అనంతరం హైదరాబాద్ రాష్ట్రం విలీనం విషయంలో సర్దార్ పటేల్ చూపిన దౌత్య చతురత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ‘ఆపరేషన్ పోలో’ ద్వారా సైన్యాన్ని వినియోగించి, హైదరాబాద్‌ను భారతదేశంలో కలిపే దిశగా నిర్ణయాత్మక చర్యలు చేపట్టారు. ఈ సంఘటన దేశ ఐక్యతకు ఆయన కట్టుబాటును ప్రతిబింబించింది.
పరిపాలనా వ్యవస్థల రూపశిల్పి
పటేల్ కఠినమైన, న్యాయమైన పరిపాలనకు కృషి చేశారు. ఆయనే ఐఏఎస్, ఐపీఎస్ వంటి కేంద్ర పరిపాలనా సేవలకు పునాదులు వేశారు. “భారతదేశం కేవలం రాజకీయ సమాఖ్య కాదు, మనసుల సమైక్యం” అనే ఆయన మాటలు నేటికీ స్ఫూర్తినిస్తాయి.
స్టాట్యూ ఆఫ్ యూనిటీ — సజీవ చిహ్నం
గుజరాత్‌లోని నర్మదా తీరాన 182 మీటర్ల ఎత్తులో నిర్మించిన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఆయన విశాల హృదయానికి, దేశ ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా గుర్తింపును పొందింది.
జాతీయ ఐక్యతా దివస్‌గా జయంతి
2014 అక్టోబర్ 24న కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దివస్‌గా ప్రకటించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఐక్యతా ప్రతిజ్ఞలు, ర్యాలీలు నిర్వహించడం సాంప్రదాయంగా మారింది. విద్యార్థుల్లో జాతి సమైక్యత, సమగ్రత భావాలను పెంపొందించే దిశగా ఈ దినోత్సవం ప్రాధాన్యం సంతరించుకుంది.సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన మార్గం దేశభక్తి, ఐక్యత, కర్తవ్యబోధకు చిరస్మరణీయ ప్రేరణగా నిలుస్తోంది.
